సనాతన ధర్మాన్ని అవమానిస్తున్న ‘ఇండియా’ కూటమి

* ఉద‌య‌నిధి స్టాలిన్ వ్యాఖ్యలపై దుమారం
సనాతన ధర్మాన్ని ఇండియా కూటమి గత రెండు రోజులుగా విమర్శిస్తోందని, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం డీఎంకే, కాంగ్రెస్ నేతలు సతానత ధర్మాన్ని నిర్మూలిస్తామంటూ మాట్లాడుతున్నారని కేంద్రం హోం మంత్రి అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. సనాతన ధర్మాన్ని వారు విమర్శించడం ఇదేమీ మొదటిసారి కాదని ఆయన చెప్పారు. 
 
రాజస్థాన్‌లోని భనేశ్వర్ ధామ్ నుంచి రెండో ‘పరివార్ సంకల్ప్ యాత్ర’ను అమిత్‌షా ఆదివారంనాడు ప్రారంభిస్తూ అశోక్ గెహ్లాట్ ప్రభుత్వానికి ఈ యాత్ర ద్వారా చరమగీతం పాడనున్నట్టు చెప్పారు. గతంలో, బడ్జెట్‌పై తొలి హక్కు మైనారిటీలకు ఉందని మన్మోహన్ సింగ్ అన్నారని ఆయన గుర్తు చేశారు.  అయితే మొదటి హక్కు పేదలు, గిరిజనులు, దళితులు, వెనుకబడిన వారికి ఉందని తాము తెగేసి తాము చెప్పామని పేర్కొన్నారు.
ఈరోజు మోదీ ప్రభుత్వం గెలిస్తే సనాతన పాలన వస్తుందని కాంగ్రెస్ పార్టీ చెబుతోందన ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ అయితే హిందూ సంస్థలను లష్కరే తొయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో పోలుస్తున్నారని, లష్కరో కంటే ప్రమాదకరమని అంటున్నారని అమిత్‌షా విమర్శించారు. గిరిజనులకు గతంలో 20 శాతం రిజర్వేషన్ ఉండేదని, రమణ్ సింగ్ సారథ్యంలోని గత బీజేపీ ప్రభుత్వం దానిని 32 శాతానికి పెంచేందుకు కృషి చేసిందని అమిత్‌షా చెప్పారు. గిరిజన కమ్యూనిటీకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమి చేసిందో రాహుల్ గాంధీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇలా ఉండగా, స‌నాత‌న ధ‌ర్మాన్ని డెంగ్యూ, మ‌లేరియాతో పోల్చుతూ త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కుమారుడు ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు పెనుదుమారం రేపుతున్నాయి. స‌నాత‌న ధ‌ర్మంపై ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌ల‌ను కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబ‌రం స‌మ‌ర్ధించారు.  కుల క్ర‌మానుగ‌త స‌మాజానికి స‌నాత‌న ధ‌ర్మం దిక్సూచి వంటిద‌ని, స‌నాత‌న ధ‌ర్మాన్ని ప్రోత్స‌హించేవారు దీని నుంచి ల‌బ్ధిపొందిన ఉన్న‌త వ‌ర్గానికి చెందిన వార‌ని త‌మిళనాడు శివ‌గంగ ఎంపీ కార్తీ చిదంబ‌రం ఆరోపించారు.
స‌నాత‌న ధ‌ర్మం సామాజిక న్యాయం, స‌మాన‌త్వానికి వ్య‌తిరేక‌మ‌ని ఉద‌య‌నిధి స్టాలిన్ శ‌నివారం ఓ కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. దీన్ని వ్య‌తిరేకించ‌డ‌మే కాదు..ర‌ద్దు చేయాల‌ని చెబుతూ మ‌నం డెంగ్యూ, దోమ‌లు, మ‌లేరియా, క‌రోనాను వ్య‌తిరేకించ‌డం కాదు..వాటిని నిర్మూలించాల‌ని అదేమాదిరిగా మ‌నం స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపాయి. 
 
మ‌రోవైపు దేశంలో స‌నాత‌న ధ‌ర్మాన్ని అనుస‌రించే 80 శాతం మంది ప్ర‌జ‌ల ఊచ‌కోతకు డీఎంకే నేత పిలుపు ఇవ్వ‌డం దారుణ‌మ‌ని బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల‌వీయ ఆరోపించారు. ఉద‌య‌నిధి స్టాలిన్ ప్ర‌సంగ వీడియోను హిందీ స‌బ్‌టైటిల్స్‌తో ఆయన సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  రాహుల్ గాంధీ ప్రేమ దుకాణం గురించి మాట్లాడుతుంటే కాంగ్రెస్ భాగ‌స్వామ్య ప‌క్షం డీఎంకే స‌నాత‌న ధ‌ర్మాన్ని నిర్మూలించాల‌ని కోరుతోంది. డీఎంకే న‌ర‌మేధం పిలుపుపై కాంగ్రెస్ మౌనం దాల్చింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. విప‌క్ష ఇండియా కూట‌మి అధికారంలోకి వస్తే వంద‌ల ఏండ్ల నాటి భార‌త్ సంస్కృతిని మంట‌గ‌లుపుతార‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.