
లోక్‌సభ ఎన్నికలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని, ముందస్తు ఎన్నికలకు వెళ్ల ఉద్దేశం ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పష్టం చేశారు. జమిలి ఎన్నికలపై పలు ఊహాగానాలు సాగుతున్న నేపధ్యంలో కేంద్ర మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ తన పదవీకాలం ముగిసే చివరి రోజు వరకూ తన సేవలను కొనసాగిస్తారని పేర్కొన్నారు.
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిపించే ఆలోచన ప్రభుత్వానికి లేదని అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు. ముందస్తు ఎన్నికలు నిర్వహిస్తారని లేదా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణను జాప్యం చేస్తారని ప్రచారం చేస్తున్నారని, ఇదంతా మీడియా ఊహాగానాలేనని మంత్రి కొట్టిపారవేశారు.
రానున్న శాసనసభల ఎన్నికలను లోక్ సభ ఎన్నికలతోపాటు నిర్వహించడం కోసం వాయిదా వేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి లేదని చెప్పారు. కొన్ని రాష్ట్రాల శాసన సభల ఎన్నికలను ముందుకు, వెనుకకు జరుపుతారని జరుగుతున్న ప్రచారమంతా మీడియా అభిప్రాయమని తెలిపారు. ‘ఒక దేశం-ఒకేసారి ఎన్నికలు’ కోసం ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని, దేశంలోని సంబంధిత అన్ని వర్గాలతోనూ ఈ కమిటీ విస్తృతంగా చర్చిస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌదరి ఈ కమిటీలో సభ్యునిగా ఉండాలని ప్రభుత్వం కోరుకుంటోందని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష గళానికి కూడా చోటు కల్పించడం వల్ల మోదీ ప్రభుత్వ విశాల హృదయం స్పష్టమవుతోందని చెప్పారు. సెప్టెంబర్ 18 నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్న మంత్రి ఈ సమావేశాల అజెండాను మాత్రం వెల్లడించలేదు. ఈ సమావేశాల అజెండాను సరైన సమయంలో పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రకటిస్తారని చెప్పారు.
More Stories
సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ మాజీ ఎంపీ దోషి
అయోధ్య రామమందిరం ప్రధాన పూజారి కన్నుమూత
2030 నాటికి 5 మిలియన్ మెట్రిక్ టన్నుల గ్రీన్ హైడ్రోజన్‌ను ఉత్పత్తి