భారత్ లో విలీనం అవుతామంటున్న ఆక్రమిత కాశ్మీరీలు

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని గిల్గిత్- బాల్టిస్థాన్ ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి పాకిస్థాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పాక్ దైవదూషణ చట్టాల ప్రకారం షియా మత గురువును అరెస్టు చేయడంపై గిల్గిత్-బాల్టిస్థాన్‌లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. 

‘చలో, చలో కార్గిల్ చలో’ నినాదాలతో ఆందోళనకారులు హోరెత్తించారు. బాల్టిస్థాన్‌లో ఈ స్థాయిలో ఆందోళనలు ఎప్పుడూ చూడలేదని, ఇదే మొదటసారని చెబుతున్నారు. తమ డిమాండ్లను నెరవేర్చని పక్షంలో అంతర్యుద్ధం తప్పదని హెచ్చరిస్తున్నారు. పైగా, తాము భారత్‌తో విలీనమవతామనే డిమాండ్ తెరపైకి తెచ్చారు.

గత నెల స్కర్దులో జరిగిన మతపరమైన సమావేశంలో షియా మత గురువు అఘా బాకిర్ అల్-హుస్సేనీ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదు చేసి ఆయనను పోలీసులు అరెస్టు చేయడంతో నిరసనలు చెలరేగాయి.

 
షియాలను టార్గెట్ చేస్తూ పాక్ దైవదూషణ చట్టాలను కఠినతరం చేయడంపై చర్చించడానికి స్కర్డులో జరిగిన ఉలేమా కౌన్సిల్ సమావేశంలో చేసిన వ్యాఖ్యలకు అఘా బకిర్ అల్-హుస్సేనీపై కేసు నమోదు చేశారు. షియా, సున్నీలు ఇస్లాం ప్రాథమిక సిద్ధాంతాలను పాటించినా నాల్గో ఖలీఫా అలీని వ్యతిరేకించిన వ్యక్తులను షియాలు వ్యతిరేకిస్తారు.
 
పాక్‌ సున్నీ మెజార్టీ దేశమే కానీ, గిల్గిత్-బాల్టిస్థాన్‌లో షియాల ప్రాబల్యం ఎక్కువ. జనరల్ జియా- ఉల్ హక్ నుంచి వరుసగా వచ్చిన పాక్ ప్రభుత్వాలు సున్నీలను ఈ ప్రాంతంలోకి తరలించడంతో గిల్గిత్- బాల్టిస్థాన్ జనాభాలో వీరే అధికంగా ఉన్నారు. ఈ ప్రాంతాన్ని పరిపాలనాపరంగా బాల్టిస్థాన్, డైమర్, గిల్గిత్ మూడు విభాగాలుగా విభజించారు. ప్రధాన పరిపాలనా కేంద్రాలు గిల్గిత్, స్కర్డు పట్టణాలు.

గిల్గిత్‌లో జరిగిన నిరసనల గురించి పాక్ మీడియాలో కవరేజ్ లేనప్పటికీ సోషల్ మీడియాలో వీడియోలు, ఫోటోలు ఈ ఆందోళన తీవ్రతను తెలియజేస్తున్నాయి. ఇది ఆక్రమిత ప్రాంతంలో కమ్యూనికేషన్‌ వ్యవస్థలపై పాక్ పట్టును సూచిస్తుంది. 

 
అఘా బకిర్ అల్-హుస్సేనీని అరెస్టు చేయాలని కోరుతూ డైమర్‌లో ఆగష్టు 22న నిరసనకు దిగిన సున్నీలు పర్వత ప్రాంతాన్ని పాకిస్థాన్‌తో కలిపే కారకోరం హైవేను దిగ్భంధిచారు. దీంతో ఆయనపై కేసు నమోదుచేసిన పోలీసులు మతపెద్దను అరెస్ట్ చేశారు. దీంతో మత గురువు అరెస్ట్‌ను నిరసిస్తూ షియాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

పాకిస్థాన్, పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ‘ప్రజలు పంజాబ్ (పాకిస్థాన్) లేదా సింధ్‌కు వెళ్లానుకోవడం లేదు.. కానీ కార్గిల్‌కు వెళ్తారు. గిల్గిత్‌ను భారతదేశంలో విలీనం చేయండి’ అని నినదించారు. అల్-హుస్సేనీని విడుదల, కారాకోరం హైవేను క్లియర్ చేయాలనే తమ డిమాండ్లను నెరవేర్చకపోతే అంతర్యుద్ధం చేస్తామని హెచ్చరించారు.వీడియోలలో, నిరసనకారులు పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం, పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్‌ను విమర్శించే నినాదాలు కూడా వినవచ్చు. ఈ మార్గం మూసివేయబడితే, ప్రజలు గిల్గిట్‌ను భారతదేశంలో విలీనం చేయడాన్ని ప్రస్తావిస్తూ, ప్రజలు పాకిస్తాన్‌లోని పంజాబ్ లేదా సింధ్‌కు కాకుండా కార్గిల్‌కు వెళతారని స్థానిక నాయకులు వీడియోలలో హెచ్చరించడం కూడా వినవచ్చు. 

గత, జనవరిలో, పాకిస్తాన్ ఇప్పటికే కఠినమైన దైవదూషణ చట్టాలను సవరించింది. ప్రవక్త ముహమ్మద్‌తో సంబంధం ఉన్న వ్యక్తులను కించపరిచే ఎవరికైనా జరిమానా విధించేలా పొడిగించింది. ఇప్పుడు వచ్చిన మార్పు ప్రవక్త ముహమ్మద్ సహచరులను అవమానించడం నేరంగా మారింది. ఇందులో చాలా మంది తొలి ముస్లింలు ఉన్నారు.

వారిలో ఒకరు ఈ కేసులో వివాదానికి మూలమైన యాజిద్. తన ప్రసంగంలో, అల్-హుస్సేనీ ముయావియా కుమారుడు యాజిద్‌ను అవమానించాడని, ఇది అతనిపై దైవదూషణ ఆరోపణలకు దారితీసిందని ఆరోపించారు. యాజిద్ ఆదేశం మేరకు, కర్బలా యుద్ధంలో హుస్సేన్ (మహమ్మద్ ప్రవక్త మనవడు) చంపబడ్డాడు.