ఐదురోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు

కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెలలో ఐదు రోజుల పాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు వెల్లడించింది. సెప్టెంబర్‌ 18 నుంచి 22వ తేదీ వరకు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నట్లు కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ గురువారం ట్విట్టర్‌ ద్వారా తెలిపారు. 
 
‘సెప్టెంబర్ 18 నుంచి 22వ తేదీ వరకూ ఐదు రోజులపాటు పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించాం. అమృత్‌ కాల్‌లో భాగంగా పార్లమెంట్‌లో ఫలవంతమైన చర్చలు జరుగుతాయని భావిస్తున్నాం’ అని ఆయన పేర్కొన్నారు. అయితే , పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు.

ఈ సమావేశాలను ఎందుకు నిర్వహిస్తున్నదీ ప్రభుత్వ వర్గాలు వెల్లడించలేదు. ఈ సమావేశాలు నూతన పార్లమెంటు భవనంలో నిర్వహిస్తారా? అనే అంశంపై స్పష్టత లేదు. లోక్ సభ, రాజ్య సభ సంయుక్త సమావేశం కూడా కాకపోవచ్చునని తెలుస్తోంది. 

అమృత కాలం సంబరాలు, ‘అభివృద్ధి చెందిన దేశం’గా భారత దేశం ఎదగడం గురించి చర్చ జరుగుతుందని కొందరు చెప్తున్నారు. ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయా? అని కొందరు ఆలోచిస్తున్నారు. చంద్రయాన్-3 విజయవంతమవడం, ప్రతిపక్ష ఇండియా కూటమి చకచకా పావులు కదుపుతుండటం, జీ20 సమావేశాల అనంతరం ఈ ప్రత్యేక సమావేశాలు జరగబోతుండటం ఆసక్తికరంగా మారింది.