ఆకాశంలో కనులవిందు చేసిన సూపర్ బ్లూమూన్‌

ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఆగస్టు నెలలో రెండు పున్నములు రావడంతో రెండో పున్నమి రోజు పెద్దగా కనిపించే చంద్రుడిని సూపర్ బ్లూమూన్‌ అంటారు. ఆగస్టులో తొలి పౌర్ణమి 1వ తేదీన వచ్చింది. బుధవారం రెండో పౌర్ణమి. కాబట్టి పెద్దగా కనిపించే చంద్రుడే బ్లూ మూన్‌.  పౌర్ణమి సమయంలో చందమామ భూమికి దగ్గరగా రావడంతో సూపర్‌ మూన్‌ ఆవిష్కృతమవుతుంది.

సాధారణ పౌర్ణమి రోజుల కంటే సూపర్‌ మూన్‌ సమయంలో చంద్రుడు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడు. సాధారణ పౌర్ణమి రోజులతో పోల్చుకుంటే పరిమాణంలో 40 శాతం పెద్దదిగా కనిపిస్తోంది. 30 శాతం అధికంగా వెలుగును పంచుతోంది చందమామ. వెన్నెలను వెదజల్లుతోన్న చంద్రుడిని వీక్షించడానికి జనం ఆసక్తి చూపారు. బుధవారం చీకటి పడిన తర్వాత దేశవ్యాప్తంగా సూపర్‌ బ్లూమూన్‌ ఆవిష్కృతమైంది. 

ఈ బ్లూమూన్‌ ఎలాంటి ప్రత్యేక పరికరాలను ఉపయోగించకుండా నేరుగా చూడవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  ఒకే నెలలో రెండోసారి ఏర్పడే పున్నమి చంద్రుడిని బ్లూ మూన్‌గా పిలుస్తుంటారు. అరుదుగా ఒకే నెలలో రెండు పున్నములు ఏర్పడుతుంటాయని నాసా తెలిపింది.

 కాగా, చివరిసారిగా బ్లూ మూన్‌ 2009 డిసెంబర్‌లో ఏర్పడగా మళ్లీ 2032, 2037 ఆగస్టులో కూడా బ్లూ మూన్‌ ఏర్పడబోతున్నది. అయితే, బ్లూమూన్‌ అంటే చంద్రుడు బ్లూ కలర్‌లో కనిపించడు. పరిమాణంలో పెద్దగా కనిపిస్తాడు. కాగా, ఈ అరుదైన ఖగోళ దృశ్యాన్ని అందరూ తిలకించాలని, మళ్లీ తొమ్మిది సంవత్సరాల వరకు చూడలేరని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.