ఎక్కువగా కెనడా బాట పడుతున్న భారత సాంకేతిక నిపుణులు

భారత దేశం నుండి సాంకేతిక నిపుణులు ఇటీవల కాలంలో ఎక్కువగా కెనడా బాట పడుతున్నారు. ఏప్రిల్‌ 2022 నుంచి మార్చి 2023 వరకు 12 నెలల వ్యవధిలో 15,000 మంది భారతీయ టెక్‌ వర్కర్లు కెనడాకు వెళ్లారు. కెనడాలో విస్తరిస్తున్న టెక్‌ వర్క్‌ ఫోర్సులో భారత్‌ నుంచి వెళ్తున్న వారే అధికంగా ఉన్నారు.

ది టెక్నాలజీ కౌన్సిల్స్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా, కెనడా యొక్క టెక్‌ నెట్‌వర్క్‌ ఇటీవల ఈ గణాంకాలను వెల్లడించింది. విదేశాలకు వెళ్లిన మొత్తం 32,000 ఎక్కువ మంది సాంకేతిక నిపుణుల్లో, 15,000 మంది కెనడానే తమ కొత్త నివాసంగా ఎంచుకున్నారు. భారతీయ టెక్‌ వర్కర్లను కెనడా చాలా ఆకర్షిస్తున్న దానికి ఈ డేటానే నిదర్శనం. 

భారత్‌ తర్వాతి స్థానంలో 1808 మంది టెక్‌ కార్మికుల వలసతో నైజీరియా రెండో స్థానంలో ఉంది. కెనడా ఇమ్మిగ్రేషన్‌ విధానాలు ఫ్రెండ్లీగా, సులభతరంగా ఉండటంతో చాలా మంది టెక్కీలు అక్కడి వెళ్తున్నట్లు ఖాల్సా వోక్స్‌ వెల్లడించింది. ఖల్సా వోక్స్‌ అనేది ఆన్‌లైన్‌ డైజెస్ట్‌, ఇది పంజాబ్‌ రాజకీయాలు, చరిత్ర, సంస్కతి, వారసత్వం వంటి విషయాలను అందిస్తుంటుంది. ముఖ్యంగా కెనడాలోని మాంట్రియాల్‌, మిస్సిసౌగా నగరాలు ప్రపంచ సాంకేతిక నైపుణ్యాల ప్రవాహాలకు కేంద్రంగా ఉన్నాయి. 

ఒక్క మిస్సిసౌగాలోనే దాదాపుగా 1000 ఐటీ సంస్థలు, 3,00,000 కంటే ఎక్కువ టెక్‌ నిపుణులను కలిగి ఉంది. 201 నుంచి 2020 మధ్య టెక్‌ ఎకోసిస్టమ్‌ లో 31 శాతం వద్ధిని నమోదు చేసింది. కెనడాకు ఎక్కువగా భారత్‌, నైజీరియా, బ్రెజిల్‌ నుంచే వెళ్తున్నారు. దీంతో పాటు కెనడా అమెరికన్‌ నగరాలైన ఫిలడెల్ఫియా, వాషింగ్టన్‌ డీసీ, బోస్టన్‌, చికాగో నుంచి సాంకేతిక నిపుణులను ఆకర్షిస్తోంది.