మరో కేసులో ఇంకా జైలులోనే ఉన్న ఇమ్రాన్ ఖాన్

పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ను కష్టాలు వెంటాడుతున్నాయి. తోషాఖానా కేసులో విడుదలకు కోర్టు ఆదేశించినా ఇంకా జైలులోనే కొనసాగుతున్నారు. తాజాగా రహస్య పత్రాల లీకేజీకి సంబంధించిన కేసులో జ్యుడీషియల్‌ కస్టడీని పాక్‌ ప్రత్యేక కోర్టు సెప్టెంబర్‌ 13 వరకు పొడిగించింది. దీంతో జైలు నుంచి బయటపడాలన్న ఇమ్రాన్‌ ఆశలకు కోర్టు గండికొట్టింది.

భద్రతా కారణాల నేపథ్యంలో అట్టాక్‌ జైలులో రహస్య పత్రాల లీకేజీ కేసుపై విచారణ జరిగింది. విచారణ సందర్భంగా ఇమ్రాన్‌ ఖాన్‌ జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగిస్తూ న్యాయమూర్తి అబ్దుల్‌ హస్నత్‌ జుల్కర్నైన్‌ ఆదేశించారు.  గతంలో జరిగిన ఓ ర్యాలీలో ఇమ్రాన్‌ ఖాన్‌ ఓ ప్రతాన్ని చూపించారు. అమెరికాలోని పాక్‌ ఎంబసీ నుంచి ఈ ఆధారాలను సేకరించినట్లు ఆ సమయంలో ప్రకటించారు.

అయితే, తోషాఖానా కేసులో ఇమ్రాన్‌ ఖాన్‌ ఆగస్టు 5 నుంచి పంజాబ్‌ అట్టాక్‌ జైలు ఉంటున్నారు. మంగళవారం ఇస్లామాబాద్‌ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇమ్రాన్‌ఖాన్‌కు విధించిన శిక్షను సస్పెండ్‌ చేస్తూ విడుదలకు ఆదేశించింది. హైకోర్టు ఆదేశం ఇచ్చినా ఇమ్రాన్‌ఖాన్‌ జైలు నుంచి విడుదల కాలేదు. రహస్య పత్రాల లీక్‌ వ్యవహారంలో రిమాండ్‌కు తరలించాలని కోర్టు ఆదేశించింది.

జైలులో విచారణ జరుపడంపై పిటీఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. మరో వైపు విదేశాంగశాఖ మాజీ మంత్రి మెహమూద్‌ ఖురేషి సైతం కస్టడీలో ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఇమ్రాన్‌ఖాన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో ఇమ్రాన్‌ఖాన్ ఓ ర్యాలీలో తన జేబులో నుంచి ఓ పత్రాన్ని చూపించారు. 

ఆ పేపర్‌ ప్రభుత్వ రహస్య పత్రమని, తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు అంతర్జాతీయ కుట్ర జరుగుతుందని ఇమ్రాన్‌ఖాన్‌ పేర్కొన్నారు. విచారణ సందర్భంగా రాలీలో తాను చూపిన పత్రం రహస్య పత్రమన్న వాదనలను ఆయన ఖండించారు. ఆ పత్రం ఎక్కడో పోయిందని, దాన్ని ఎక్కడ పెట్టానన్నది గుర్తుకు రాలేదని చెబుతున్నారు.