ఆక్సాయి చిన్‌లో చైనా సొరంగాలు, బంకర్లు

సరిహద్దుల్లో ప్రశాంతత కోసం, యధాస్థితి కొనసాగింపు కోసం భారత్ – చైనా కమాండర్ల స్థాయిలో గత మూడేళ్ళుగా 19 సార్లు చర్చలు సాగుతున్నా, చైనా కవ్వింపు చర్యలను కొనసాగిస్తున్నది. భారత్ భూభాగాలైన అరుణాచల్ ప్రదేశ్, ఆక్సాయి చిన్‌లను తమవిగా పేర్కొంటూ చైనా కొత్త మ్యాప్‌ను సోమవారం విడుదల చేయగా, తాజాగా, భారత భూభాగంలో చైనా సొరంగాలు, బంకర్లు నిర్మిస్తోన్న విషయం వెలుగులోకి వచ్చింది.
 
ఉత్తర లడఖ్‌లోని దెప్సాంగ్ మైదానానికి తూర్పున అరవై కిలోమీటర్ల దూరంలో సైనికులు, ఆయుధాల కోసం బహుళ పటిష్ట ఆశ్రయాలు, బంకర్ల నిర్మాణానికి చైనా దళాలు ఇరుకైన నదీ లోయతో పాటు కొండపైకి సొరంగాలు, భూగర్భ పనులు ప్రారంభించినట్టు అమెరికాకు చెందిన మాక్సర్ టెక్నాలజీస్ సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు వెల్లడిస్తున్నాయి.
 
డిసెంబర్‌ 2021 నాటి అక్సాయ్‌చిన్‌ రీజియన్‌ ఫోటోలు, ఈ ఏడాది ఆగస్టు 18న అదే రీజియన్‌లో పలు నిర్మాణాలతో కూడిన ఫోటోలను మాక్సర్ విడుదల చేసింది. అంతర్జాతీయ భౌగోళిక- ఇంటెలిజెన్స్ నిపుణులు ఈ ఫోటోలను విశ్లేషించి నివేదికను విడుదల చేశారు. 
 
వాస్తవాధీన రేఖకు తూర్పున చైనా అక్రమించుకున్న చారిత్రకంగా భారత్ భూభాగామైన ఆక్సాయి చిన్‌ను ఈ నివేదికలో గుర్తించారు.  ఈ ఫోటోలు గత కొన్ని నెలలుగా చైనా భారీ నిర్మాణ కార్యకలాపాలను వెల్లడిస్తున్నాయి. ఈ నిర్మాణాలు భారత్ వైమానిక, ఫిరంగిదళ దాడుల నుంచి సైనికులు, ఆయుధాలను రక్షించే అవకాశం ఉంది.
 
తన భూభాగాల రక్షణకోసం భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ ఉండడంతో చైనా అక్సాయ్ చిన్‌లో ఇటువంటి చర్యలకు దిగినట్టు సమర్ధించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ‘సరిహద్దుకు సమీపంలో భూగర్భ సౌకర్యాలను నెలకొల్పడం.. మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం ద్వారా చైనా వ్యూహకర్తలు అక్సాయ్ చిన్‌లో భారత వైమానిక దళం ప్రస్తుత ప్రయోజనాన్ని సమతుల్యం చేయడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది’ అని ఇంటెల్‌ ల్యాబ్‌లోని ప్రముఖ నిపుణుడు డామియన్ సైమన్ చెప్పారు.

ప్రముఖ భారతీయ డ్రోన్ స్టార్టప్ న్యూస్పేస్ రిసెర్చ్ అండ్ టెక్నాలజీస్ సీఈఓ సమీర్ జోషి ‘గాల్వాన్ ఘర్షణ తర్వాత భారత సైన్యం యుద్ధ సామాగ్రిని ముఖ్యంగా దీర్ఘ-శ్రేణి ట్యూబ్, రాకెట్ ఆర్టిలరీలను సరిహద్దుల్లో మోహరించింది.. చైనా చేపట్టిన నిర్మాణాలు భారత దాడి సామర్థ్యంతో నేరుగా ముడిపడి ఉంది’ అని  తెలిపారు. 
‘టిబెట్‌లో చైనా విస్తరణ కాంక్షను భారత్ అడ్డుకోవడంతో ప్రస్తుత ప్రమాదాన్ని తగ్గించడానికి పటిష్ట షెల్టర్‌లు, బంకర్‌లు, సొరంగాలు, రోడ్ల విస్తరణతో సహా భారీ నిర్మాణ కార్యకలాపాలు జరుగుతున్నాయి’ అని ఆయన వివరించారు.