తెలంగాణ కాంగ్రెస్ లో `కుటుంభ రాజకీయం’

తెలంగాణలో ఒక వంక బిఆర్ఎస్, మరోవంక కాంగ్రెస్ కుటుంభ రాజకీయాలకు నిలయంగా మారాయి. ఈ మచ్చ పోగొట్టుకునేందుకు ఒకే కుటుంభంలో ఇద్దరికీ సీట్లు ఇవ్వరాదని ఉదయపూర్ ఏఐసీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రకటించినా ఆ పార్టీ సీనియర్ నాయకులే ఎదురు తిరుగుతున్న వైనం తెలంగాణాలో ప్రత్యక్షం అవుతుంది.
 
దానితో, తెలంగాణ కాంగ్రెస్ కమిటీలో మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రస్తుత అధ్యక్షుడు రేవంత్ రెడ్డిలకు మధ్య నెలకొన్న ఆధిపత్య పోరు ఎన్నికలు దగ్గర పడుతున్నా సమస్య పోయేటట్లు కనిపించడం లేదు. తాజాగా తనతో  పాటు, తన భార్యకు కూడా అసెంబ్లీ సీట్లు కేటాయిస్తూ టిపిసిసి సిఫార్సు చేయాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి పట్టుబట్టడం వివాదం రేపుతోంది.
 
తాను హుజూర్ నగర్‌ నుంచి పోటీ చేస్తే.. తన భార్య కోదాడ నుంచి బరిలో దిగనున్నట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు.  అయితే, ఒకే కుటుంభంలో ఇద్దరికీ సీట్లు ఇవ్వొద్దని పేర్కొన్న ఏఐసీసీ నిబంధనలు, ఉదయ్‌పూర్ డిక్లరేషన్ ప్రకారంగానే సీట్లు కేటాయింపు ఉంటుందని రేవంత్ మద్దతుదారులు స్పష్టం చేస్తున్నారు. ఉత్తమ్ తో పాటు పలువురు  సీనియర్ కాంగ్రెస్ నేతలు సహితం తమ కుటుంభంలో ఇద్దరికీ చొప్పున సీట్లు ఇవ్వాలని పట్టుబడుతున్నారు.
 
గతంలో ఉత్తమ్ ఎంపీగా ఉండగా, ఆయన భార్య పద్మావతి ఎమ్యెల్యేగా ఉన్నారు. అయితే ఆమె 2018లో ఓటమి చెందారు. హుజూర్‌నగర్, కోదాడలో తామిద్దరం 50 వేల కంటే తక్కువ మెజారిటీ వస్ రాజకీయాల నుంచి తప్పుకుంటానంటూ కూడా సవాల్ చేశారు.  దరఖాస్తుల పరిశీలన కోసం ఆగష్టు 29న గాంధీభవన్‌లో జరిగిన ఎన్నికల కమిటీ భేటీలో ఈ విషయంపై రచ్చ రచ్చ అయింది.
రేవంత్‌, ఉత్తమ్‌కుమార్‌ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకున్నట్టు సమాచారం. ఒకే కుటుంబానికి రెండు టికెట్లపై వీరిద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం జరిగినట్లు తెలిసింది.  ఉత్తమ్‌, ఆయన భార్య పద్మావతి రెండు సీట్ల కోసం దరఖాస్తు చేసుకోగా, దీనిపై స్పష్టత ఇవ్వాలని మహేశ్‌గౌడ్‌ కోరారు. స్పందించిన ఉత్తమ్‌ దీనిపై ఇప్పుడు చర్చ ఎందుకని, ఎవరిని టార్గెట్‌ చేస్తూ ఈ అంశాన్ని ప్రస్తావించారని ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది.
జోక్యం చేసుకున్న రేవంత్‌రెడ్డి ఈ విషయాన్ని హైకమాండ్‌ చూసుకుంటుందని పేర్కొన్నారు.  రేవంత్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఉత్తమ్‌ పీసీసీ అధ్యక్షుడిగా దీనిపై అభిప్రాయం చెప్పాలని, హైకమాండ్‌కు సిఫారసు చేయాలని డిమాండ్‌ చేశారు. కల్పించుకున్న రేవంత్‌ టికెట్ల విషయంలో తనను డిక్టేట్‌ చేయొద్దని ఉత్తమ్‌ను హెచ్చరించినట్లు చెబుతున్నారు.
 
ఇది కేవలం ఉత్తమ్ కుమార్ రెడ్డికి సంబంధించిన వివాదామే కాదు. సీనియర్ నేత కె జానారెడ్డి ఈ సారి తాను ఎన్నికలలో పోటీచేయను అంటూనే తన ఇద్దరి కుమారులకు రెండు సీట్లు కోరుతున్నారు. జయవీర్ రెడ్డికి నాగార్జునసాగర్, రఘువీర్ రెడ్డికి మిర్యాలగూడ సీట్లు కోరుతున్నారు. ఇక, బిఆర్ఎస్ సీట్ నిరాకరించడంతో కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దమైన సిట్టింగ్ ఎమ్యెల్యే రేఖా నాయక్ తనకు తన ఖానాపూర్ సీట్ తో పాటు ప్రభుత్వం ఉద్యోగంకు రాజీనామా చేసేందుకు సిద్దమైన భర్త శ్యామ్ నాయక్ కు ఆసిఫాబాద్ సీట్ ఇవ్వాలని స్పష్టం చేస్తున్నారు.
 
మరోవంక, ఫైర్ బ్రాండ్ ఎమ్యెల్యే సీతక్క తాను తిరిగి ములుగు నుండి పోటీ చేయడంతో పాటు తన కుమారుడు సూర్యకు పినపాక సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు. మాజీ ఎమ్యెల్యే కొండా సురేఖ తనకు వరంగల్ సీటుతో పాటు భర్త కొండా మురళికి పరకాల సీటు అడుగుతున్నారు.  దామోదరం రాజనరసింహ, ఎంజాయ్ కుమార్ యాదవ్ లతో సహా పలువురు తమ కుటుంభం సభ్యులకు సీట్లకోసం పట్టుబడుతున్నారు. అయితే, ఈ విషయంలో టిపిసిసి ఎటువంటి సిఫార్సు చేయబోదని, ఏఐసీసీ చూసుకొంటుందని అంటూ రేవంత్ రెడ్డి దాటవేస్తున్నారు.