జమ్ముకశ్మీర్‌ ఎన్నికలకు ఎప్పుడైనా సిద్ధమే

జమ్ముకాశ్మీర్‌లో ఎన్నికలు ఎప్పుడైనా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రం గురువారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఎన్నికల నిర్వహణకు అవసరమైన చర్యలను కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొంటుందని కూడా తెలిపింది.  ఓటర్ల జాబితా సవరణ చాలావరకు పూర్తయిందని, మిగిలిన భాగాన్ని కూడా ఎన్నికల కమిషన్ పూర్తి చేయనున్నదని సొలిసిట్ జనరల్ తుషార్ మెహతా తెలిపారు.
ఎన్నికలు మూడు స్థాయిలలో జరపాల్సి ఉందని చెబుతూ మొదటి సారిగా పంచాయతీ, జిల్లా అభివృద్ధి మండలిల ఎన్నికలు జరపడం జరిగిందని ఆయన గుర్తు చేశారు.  లేహ్ మండలి ఎన్నికలు జరిగాయని, కార్గిల్ ఎన్నికలు త్వరలో జరుగబోతున్నాయని చెబుతూ ఇక మునిసిపల్, అసెంబ్లీ ఎన్నికలు జరపాల్సి ఉందని వివరించారు.
 
జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కలిగించే ఆర్టికల్ 370 ని కేంద్ర ప్రభుత్వం 2019 లో రద్దు చేసింది. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్‌లో శాంతి భద్రతలు మెరుగుపడ్డాయని, పరిస్థితులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయని కేంద్ర ప్రభుత్వం పదే పదే చెబుతోంది.  ఈ క్రమంలోనే జమ్ము కశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తాజాగా సుప్రీం కోర్టుకు వెల్లడించింది.
ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించి దాఖలైన అన్ని పిటిషన్లపై గత కొంత కాలంగా విచారణ జరుపుతున్న దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ విషయమై కేంద్ర ప్రభుత్వాన్ని వివరాలు కోరింది. ఎన్నికలు నిర్వహించే ఉద్దేశ్యం ఉందా? అని కూడా అడిగింది.  కాగా, జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించడానికి  కొంత సమయం పడుతుందని స్పష్టం చేసింది.
అక్కడ ఒక అసాధారణమైన పరిస్థితులు నెలకొన్నందున నిర్దుష్టంగా అందుకు గడువు వివరింపలేమని తుషార్ మెహతా చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందిస్తున్నామని, అయితే దీనికి కొంత సమయం పడుతుందని కేంద్రం వెల్లడించారు. ఆర్టికల్‌ 370 రద్దును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లపై కొద్ది రోజులుగా సుప్రీం కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. 
జమ్ము కశ్మీర్‌, లడఖ్ ప్రాంతాలకు కేంద్ర పాలిత హోదా శాశ్వతం కాదని ఇప్పటికే సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.  సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఆధ్వర్యంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం జమ్ము కశ్మీర్‌పై దాఖలైన వాదనలపై విచారణ జరుపుతోంది. జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతోనే జమ్ము కశ్మీర్ రాష్ట్రాన్ని పునర్వ్యవస్థీకరించారనే అంశాన్ని ధర్మాసనం ఏకీభవిస్తుందన తెలిపింది. 
 
అయితే, అదే సమయంలో ప్రజాస్వామ్యం కూడా చాలా ముఖ్యమైందని సుప్రీంకోర్టు ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే జమ్ము కశ్మీర్లో ఎక్కువ కాలం ఎన్నికలు జరగకుండా ఉండటాన్ని తాము అనుమతించమని సృష్టం చేసింది.  జమ్ము కశ్మీర్‌లో నివసిస్తున్న ప్రజలు అందరూ కలిసి కోరుకున్నా ఆర్టికల్ 370 రద్దు చేసేందుకు ఎలాంటి వ్యవస్థ లేదా అని ఆగస్టు 3 వ తేదీన జరిగిన విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
ఆర్టికల్ 370 ని ముట్టుకునే అవకాశమే లేకపోతే రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి మించిన ఓ కేటగిరీని తయారు చేసినట్లు అవుతుంది కదా అని కోర్టు వ్యాఖ్యానించింది.  జమ్ము కశ్మీర్ రాజ్యాంగ సభ రద్దుతో ఆర్టికల్ 370 శాశ్వతత్వం పొందిందా? ఆ ఆర్టికల్ రద్దు చేయడానికి పాటించిన ప్రక్రియ సరైనదేనా? అనే ప్రశ్నలు మాత్రమే ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం వ్యాఖ్యానించింది.