బీజేపీలో చేరిన చెన్నమనేని వికాస్ రావు

బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ చెన్నమనేని విద్యాసాగర్‌ రావు తనయుడు వికా‌స్ రావు రాజకీయాల్లో ప్రవేశించారు. బుధవారం మధ్యాహ్నం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సమక్షంలో భార్య డా. దీపతో కలిసి పార్టీలో చేరారు. కరీంనగర్ వేములవాడ సీటు నుండి బీజేపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు.

ఏడాది కాలంగా వికాస్‌రావు వేములవాడలో ప్రతిమ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇటీవలే కరీంనగర్ ఎంపీ, బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ని కూడా మర్యాదపూర్వకంగా కలిశారు. వేములవాడ ప్రస్తుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు విద్యాసాగర్‌రావుకు సొంత అన్న అయిన చెన్నమనేని రాజేశ్వర్‌రావు కుమారుడు. 

సాంకేతిక కారణం చేత చెన్నమనేని రమేశ్ బాబుకు వచ్చే ఎన్నికలలో పార్టీ సీటు ఇవ్వలేదు. చాలా సంవత్సరాలుగా వేములవాడ, సిరిసిల్ల ప్రాంతంలో చెన్నమనేని కుటుంబంకు ప్రత్యేక గుర్తింపు ఉంది. చెన్నమనేని రాజేశ్వర్‌ రావు సీపీఐ పార్టీ తరఫున రాజకీయ జీవితం ప్రారంభించి.. దాదాపు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 

ఆయన సోదరుడు విద్యా సాగర్‌ రావు బీజేపీతో కీలకమైన పాత్ర వహించారు. ఎమ్యెల్యేగా, ఎంపీగా పలు పర్యాయాలు గెలుపొందారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా, కేంద్రమంత్రిగా, గవర్నర్ గా పని చేసిన అనుభవం ఉంది. దానితో వికాస్ రావు రాజకీయ ప్రవేశం వేములవాడలో కీలకంగా మారే అవకాశం ఉంది.

డాక్టర్ చెన్నమనేని వికాస్, డా. దీప​ వేములవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారని చెబుతూ వారు మరింత సేవ చేయాలనే ఆలోచనతో ఈ రోజు బీజేపీలో చేరడం పట్ల కిషన్ రెడ్డి హర్షం ప్రకటించారు. బిఆర్ఎస్ నుండి తెలంగాణను రక్షించుకోవడం కోసం  తెలంగాణలోని విద్యావంతులు, మేధావులు బీజేపీలోకి రావాలని ఆయన ఈ సందర్భంగా ఆహ్వానించారు. బిజెపి ఎంపీ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె. లక్ష్మణ్,  బండి సంజయ్ కూడా వారిని పార్టీలోకి ఆహ్వానించారు