పుల్వామా ఉగ్రదాడి కారణంగా ఆర్టికల్ 370 రద్దు

పుల్వామా ఉగ్రదాడి కారణంగా ఆర్టికల్ 370 రద్దు
జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు ఆలోచనకు 2019 ఫిబ్రవరి నాటి పుల్వామా ఉగ్రదాడి కారణమైందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలను బలిగొన్న నాటి ఘటన జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని పూర్తిగా ఇండియన్ యూనియన్‌లో విలీనం చేయాలనే ఆలోచనకు బీజం వేసిందని తెలిపింది. 
ఈ మేరకు ఆర్టికల్ 370 రద్దు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో రోజువారీ విచారణ సందర్భంగా కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ హెహతా వాదనలు వినిపించారు. కేంద్రం చర్య ఫలితంగా కశ్మీరీలు స్వయంప్రతిపత్తి, అంతర్గత సార్వభౌమాధికారం కోల్పోయారని నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు చేసిన ఆరోపణలకు సొలిసిటర్ జనరల్ కొట్టిపారవేసారు.
నిర్దేశిత స‌మ‌యంలోగా ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని  చ‌క్క‌దిద్దాల‌ని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ఆదేశించగా,  ఆ రాష్ట్ర ప‌రిస్థితిపై గురువారం పాజిటివ్ ప్ర‌క‌ట‌న చేయ‌నున్న‌ట్లు కేంద్రం త‌ర‌పున కోర్టులో సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ తెలిపారు.

ఈ సందర్భంగా ఆర్టికల్ 35ఏ కశ్మీరీలకు ప్రాథమిక హక్కులను వర్తింపజేయడానికి పరిమితం చేసిందన్న సొలిసిటర్ జనరల్ వాదనలతో సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం ఏకీభవించింది. భారత రాజ్యాంగాన్ని జమ్మూ కశ్మీర్‌కు పూర్తిగా వర్తింపజేయాలని, 1957 నాటి ఆ రాష్ట్ర రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలనే ఉద్దేశంతో ఆర్టికల్ 370 రద్దుకు కేంద్రం అనుసరించిన విధానాలను కూడా తప్పుపట్టలేమని మెహతా చెప్పారు.

‘కశ్మీరీలు స్వయంప్రతిపత్తి , అంతర్గత సార్వభౌమాధికారాన్ని కోల్పోయారనే కారణంతో రెండు ప్రముఖ రాజకీయ పార్టీలు నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీలు ఈ నిర్ణయాన్ని సవాలు చేశాయి. వాస్తవం ఏంటంటే శాశ్వత నివాసితులు, ఇతరుల మధ్య ప్రాథమిక హక్కులను హరించడానికి కృత్రిమంగా సృష్టించిన వ్యత్యాసం వల్ల కశ్మీరీలు తమ జీవితం, ఆస్తి, సెటిల్‌మెంట్, ఉపాధికి సంబంధించిన ప్రాథమిక హక్కులను పూర్తి స్థాయిలో ఆస్వాదించలేదు..’ అని ఎస్జీ వాదించారు.

ఆర్టికల్ 370,ఆర్టికల్ 35A వల్ల తమ విలువైన హక్కులను ఎలా కోల్పోతున్నారో తెలియజేయడానికి బదులు ఈ రెండు పార్టీలు రద్దును వ్యతిరేకించి, ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నాయని పేర్కొన్నారు. ‘కశ్మీరీల హక్కులకు ఆటంకం కలిగించడం వారి అహంకారానికి నిదర్శనం. వారి హక్కులను హరించే, ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేసే నిబంధన కోసం పోరాడుతున్నారు’ అని తుషారా మెహతా ధ్వజమెత్తారు.