ఇద్దరు అల్‌ఖైదా ఉగ్రవాదులపై ఎన్‌ఐఎ ఛార్జిషీట్‌

భారత్‌లో ఉగ్రవాదం, హింసను వ్యాప్తి చేసేందుకు కుట్ర పన్నిన అల్‌ఖైదా గ్రూపుకు చెందిన ఇద్దరు సభ్యులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. అస్సాం నుండి పనిచేస్తున్న ఈ అల్‌ఖైదా గ్రూపుకు చెందిన సభ్యుల్ని మహ్మద్‌ అక్బర్‌ అలి అలియాస్‌ అక్బర్‌ అలీ, అబుల్‌ కలాం ఆజాద్‌లుగా ఎన్‌ఐఎగా గుర్తించింది.
 
వీరిద్దరూ అన్సరుల్లా బంగ్లా టీమ్‌ (ఎబిటి) ఉగ్రవాద సంస్థకు చెందిన వారితో కలిసి భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు ప్రేరేపించడానికి, ప్రోత్సహించడానికి కుట్ర పన్నారు. ఈ నిందితులిద్దరూ ఆల్‌ఖైదా, ఎబిటి గ్రూపులను బలోపేతం చేసేందుకు కృషి చేశారని, అలాగే ఉగ్రవాద చర్యలకు పాల్పడేలా యువతను ప్రోత్సహించి వారిని తీర్చిదిద్దారని తన దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఎ పేర్కొంది. 
 
అస్సాంలోని పొరుగు జిల్లాల్లో వివిధ మతపరమైన ప్రదేశాలకు అల్‌ఖైదా తన కార్యకలాపాలను విస్తరించడానికి ఈ ఇద్దరు నిందితులు సమాశాలు నిర్వహించారని దర్యాప్తులో తేలిందని ఎన్‌ఐఎ తెలిపింది. ముస్లింల సమీకరణ బంగ్లాదేశ్‌ ఎబిటికి చెందిన జకీర్‌ అలియాస్‌ మెహదీ హసన్‌, మెహబూర్‌ రెహమాన్‌ ఆలం ఆలియాస్‌ సుల్తాన్‌ మార్గదర్శకత్వంలోనే జరుగుతున్నాయని ఎన్‌ఐఎ వెల్లడించింది. 
 
అస్సాంలోని బార్‌పేట జిల్లాలో బంగ్లాదేశ్‌కు చెందిన సైఫుల్‌ ఇస్లాం ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు నాయకత్వం వహించినట్లు ఎన్‌ఐఎ ఏజెన్సీ సంస్థ పేర్కొంది. సైఫుల్‌ ‘షైఖుల్‌ హిందీ మహ్మదుల్‌ హసన్‌ జామియుల్‌ హుదా ఇస్లామిక్‌ అకాడమీ’లో ఓ అరబిక్‌ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నట్లు నమ్మించి, ధకలియాపర మసీదులో ఇమామ్‌ ముసుగులో ఎంతో చాకచక్యంగా ఉగ్రవాద కర్యాకలాలు సాగించాడని ఎన్‌ఐఎ తెలిపింది. 
 
ముస్లింలను అల్‌ఖైదా గ్రూపులో చేర్చేందుకు చాలా చురుకుగా వ్యవహరించాడని ఎన్‌ఐఎ ఏజెన్సీ తెలిపింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించిన ఇతర సభ్యుల కోసం గాలిస్తున్నట్లు ఎన్‌ఐఎ మీడియాకు వెల్లడించింది. కాగా, అక్బర్‌ అలీ, అబుల్‌ కలాం ఆజాద్‌లను గత సంవత్సరం ఏప్రిల్‌ 5న పోలీసులు అరెస్టు చేశారు. వీరిపై భారతీయ శిక్షాస్మృతి (ఐపిసి) చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎన్‌ఐఎ అభియోగాలు మోపింది. మరో తొమ్మిది మందిపై ఎన్‌ఐఎ ఆగస్టులో ఛార్జిషీట్‌ దాఖలు చేసింది.