జనగణన కేంద్రం తప్ప మరెవ్వరు చేయరాదు

జనాభా లెక్కలను గానీ, ఆ తరహా సర్వేలను గానీ ఒక్క కేంద్ర ప్రభుత్వమే తప్ప, ఇతరత్రా మరెవ్వరూ చేయలేరని సోమవారం కేంద్రం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది.  బిహార్‌లో కులాల సర్వేను వ్యతిరేకిస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా  1948 జనగణన చట్టం కూడా ఇదే చెబుతోందని తేల్చిచెప్పింది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్​ను దాఖలు చేసింది.

సుప్రీంకోర్టు ఎదుట కేంద్రం తాజాగా చేసిన వ్యాఖ్యలతో బిహార్​ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్టు అయ్యింది! బిహార్​లో​ కులగణన చేపట్టాలని నితీశ్​ కుమార్​ ప్రభుత్వం గత కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కులగణనకు సంబంధించి ఆగస్ట్​ 6న ఓ సర్వే చేపట్టింది. ఇదే విషయాన్ని గత విచారణలో అత్యున్నత న్యాయస్థానానికి వెల్లడించింది బిహార్​ ప్రభుత్వం.

మరోవంక, మధ్యప్రదేశ్ లో తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తే కులగణన చేబడతామని కాంగ్రెస్ ప్రకటించింది. అయితే, జనాభా లెక్కలను తాము మాత్రమే చేపట్టాలని కేంద్రం చేసిన వ్యాఖ్యలు తాజాగా చర్చలకు దారితీసింది. “ఎస్​సీ,ఎస్​టీ, ఓబీసీల అభ్యున్నతికి కావాల్సిన చర్యలు చేపట్టేందుకు కేంద్రం కట్టుబడి ఉంది. రాజ్యాంగం సూచించిన దానిలో, చట్టాలను అనుసరించి కేంద్రం చర్యలు చేపడుతుంది. కానీ కులగణనతో పాటు జనాభా లెక్కలను నిర్వహించే అధికారం ఒక్క కేంద్రానికే ఉంది,” అని అఫిడవిట్​లో పేర్కొందని తెలుస్తోంది.

కులగణన నిర్వహించాలని బిహార్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకించారు. ఈ మేరకు పట్నా హైకోర్టుకు వెళ్లారు. కానీ వారికి అక్కడ చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేపట్టవచ్చని హైకోర్టు అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.

 “జనగణనను నిర్వహించే హక్కు కేవలం కేంద్రానికే ఉందని రాజ్యాంగంలో ఉంది. కానీ ప్రస్తుతం ఒక్క గెజిట్​ నోటిఫికేషన్​ను జారీ చేసి, కేంద్రం వద్ద ఉన్న అధికారాలను లాగేసుకోవాలని బిహార్​ ప్రభుత్వం చూస్తోంది,” అని పిటిషనర్లు పేర్కొన్నారు.