సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం

సూర్యుడి రహస్యాలు తెలుసుకోవడం కోసం ఆదిత్య ఎల్1 ప్రయోగాన్ని చేపట్టనున్నట్టు ఇస్రో సంస్థ ఇదివరకే ప్రకటించింది. చంద్రయాన్-3 ప్రాజెక్ట్ విజయవంతమైన ఉత్సాహంలో ఈ సోలార్ మిషన్‌‌ను సెప్టెంబర్ 2న ఉదయం 11:50 గంటలకు శ్రీహరికోటలోని షార్ నుంచి ‘ఆదిత్య ఎల్1’ను లాంచ్ చేయనున్నట్టు అధికారిక ట్విటర్ (X) ఖాతా ద్వారా వెల్లడించింది. 
 
సూర్యుడి పుట్టుక, అక్కడి వాతావరణ పరిస్థితుల్ని కనుగొనడం కోసమే ఈ ప్రయోగాన్ని ఇస్రో చేపడుతోంది.  కాగా.. ఈ ఆదిత్య ఎల్1ను భూమి నుంచి 1.5 మిలియన్ల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజ్ పాయింట్-1 (ఎల్1) దగ్గర ఉండే దీర్ఘ వృత్తాకార కక్ష్యలోకి చేరుస్తారు. భూమి నుంచి చంద్రునికి ఎంత దూరం ఉందో అందుకు నాలుగు రెట్ల దూరం ఈ కక్ష్య ఉంది. 
 
ఆదిత్య ఎల్1 177 రోజుల పాటు ప్రయాణించి ఆ కక్ష్యలోకి చేరుకుంటుంది. సూర్యుడిపై అధ్యయనం చేసేందుకు భారత్ ప్రయోగిస్తున్న తొలి స్పేస్ క్రాఫ్ట్ ఇదే కావడం విశేషం. గతంలో అమెరికా, జర్మనీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీలు సూర్యుడిపైకి ఉపగ్రహాల్ని పంపించాయి.  ఇప్పుడు ఈ ఆదిత్య ఎల్1 మిషన్‌తో సూర్యుడిపైకి ఉపగ్రహం పంపే నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టిస్తుంది.
పీఎల్ఎల్‌వీ-సీ57 అనే వాహననౌక ఈ ఆదిత్య-ఎల్‌1ను మోసుకొని నింగిలోకి దూసుకెళ్లనుంది. ఈ ఆదిత్య ఎల్1లో మొత్తం ఏడు పేలోడ్లు ఉంటాయి. 
సూర్యగోళం నుంచి ప్రసరించే అత్యంత శక్తిమంతమైన కాంతి ప్రభావాన్ని అధ్యయనం చేసేందుకు వీలుగా ఈ పేలోడ్స్‌ని రూపొందించారు. నాలుగు పేలోడ్స్ నేరుగా సూర్యుడిని అధ్యయనం చేస్తే.. మిగతా మూడు పేలోడ్స్ సమీపంలోని సౌర రేణువులు, అయస్కాంత క్షేత్రాల గురించి శోధిస్తాయి. 
 
నిజానికి.. సూర్యగోళంలో 6వేల కెల్విన్‌ డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంటే.. ఆ సూర్యునికి వేల కిలోమీటర్ల దూరం వరకు విస్తరించి ఉండే కరోనాలో మాత్రం ఉష్ణోగ్రత 10 లక్షల కెల్విన్‌ డిగ్రీలు ఉంది. ఇలా కరోనాలో వేడి పెరగడానికి గల కారణాలేంటో తెలుసుకునేందుకు.. ఆదిత్య-ఎల్‌1తో పరిశోధనలు చేయనున్నారు.