ఎంపీలో మహిళలకు ఉద్యోగాల్లో 35 శాతం రిజర్వేషన్

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత శివరాజ్ సింగ్ చౌహాన్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని మహిళలకు ఉద్యోగాల్లో ప్రస్తుతం ఉన్న 30 శాతం రిజర్వేషన్‌ను 35 శాతానికి పెంచుతున్నట్టు ప్రకటించారు. అదివారం జరిగన ‘లాడ్లీ బెహన్ సమ్మేళన్’ కార్యక్రమంలో రిజర్వేషన్ పెంపు ప్రకటనతో పాటు పలు కీలక వరాలు ప్రకటించారు.
 
”ఇంతవరకూ పోలీస్ డిపార్ట్‌మెంట్‌లో ఆడకూతుళ్లకు 30 శాతం రిజర్వేషన్ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఆ రిజర్వేషన్‌ను 35 శాతానికి పెంచుతున్నాం. తక్కిన ఉద్యోగాల్లోనూ మహిళలకు 35 శాతం కోటా ఇస్తాం. టీచర్ రిక్రూట్‌మెంట్‌కు వచ్చే సరికి అది 50 శాతం వరకూ ఉంటుంది. ప్రభుత్వంలో ఉన్నత పదవుల్లో మహిళలకు 35 శాతం నియామకాలు కల్పిస్తాం. మన సోదరీమణులకు మరింత ప్రాధాన్యం కల్పించడమే మా ప్రభుత్వ ధ్యేయం” అని శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు.
 
 ఈ శ్రావణ మాసంలో ఎల్పీజీ సిలెండర్లను రూ.450కే అందిస్తున్నామని, ఆ తర్వాత కూడా శాశ్వతంగా రూ.450కే అందించే ఏర్పాటు చేస్తామని మహిళా సమ్మేళన్‌కు హాజరైన ప్రజల హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. పెంచిన విద్యుత్ బిల్లులు వసూలు చేయరాదని ఈరోజు తాము నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. 
 
 సెప్టెంబర్‌లో పెంచిన బిల్లులు జీరో చేస్తు్న్నామని ముఖ్యమంత్రి  చెప్పారు. ఆ తర్వాత కూడా పేద మహిళలకు నెలవారీ బిల్లులు రూ.100కే పరిమితమయ్యేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.