55 పైగా దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ కేసులు

ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కొవిడ్‌ కొత్త వేరియంట్లతో ప్రమాదం ముంచుకొస్తున్నది. 55 పైగా దేశాల్లో ఎరిస్‌ కొవిడ్‌ కేసులు నమోదైనట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) ఈ వైరస్‌ను ‘వేరియంట్‌ అండర్‌ మానిటరింగ్‌’గా వర్గీకరించింది. కొత్త రూపాంతరాల్లో అదనపు ఉత్పరివర్తనాలు కనిపిస్తున్నాయని, అవి ఇన్ఫెక్షన్‌ను పెంచుతుందని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

టీకా తీసుకొని, గతంలో కొవిడ్‌ బారినపడి కోలుకున్న వారికి సైతం ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అయితే, కొత్త వేరియంట్లు బీఏ.2.86, ఈజీ.5.1 వేరియంట్లతో భారత్‌కు ఎలాంటి ముప్పు ఉండదని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఏరిస్‌ వేరియంట్‌ గతంలోనూ భారత్‌లో కనిపించింది. అయితే, దీంతో కేసుల పెరుగుదల, తీవ్రమైన వ్యాధిని అభివృద్ధి చేసే ప్రమాదం లేదని నిపుణులు చెబుతున్నారు.

కరోనా కొత్త వేరియంట్‌ బీఏ.2.86 ఒమిక్రాన్‌0[ వేరియంట్‌ నుంచి పుట్టుకువచ్చిన రూపాంతరం కావచ్చని పేర్కొంటున్నారు. ఇజ్రాయెల్‌, డెన్మార్క్‌, యూకే, యూఎస్‌లలో ఈ వేరియంట్‌ కారణంగా వేగంగా కేసులు పెరుగుతున్నాయి. అదే సమయంలో ఈజీ.5.1 ఏరిస్‌ వేరియంట్‌ కేసులు ఇప్పటి వరకు 55 కంటే ఎక్కువ దేశాల్లో రికార్డయ్యాయి. ఈ వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ వేగంగా పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. 

ఏరిస్‌ వేరియంట్‌ ఇన్ఫెక్టివిటీ పరంగా మరింత తీవ్రంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయినప్పటికీ దీని కారణంగా వ్యాధితీవ్రతలో గణనీయమైన తేడా కనిపించలేదని.. ఈ రెండు వేరియంట్లతో ఆందోళనపడాల్సిన పని లేదని చెబుతున్నారు. భారత్‌లో కరోనా పూర్తిగా ప్రస్తుతం చాలా నియంత్రణలో ఉన్నది. గత 24 గంటల్లో దాదాపు 60 మందికి వైరస్‌ సోకింది.

భారతదేశంలో బిఎ.2.86 వేరియంట్ ప్రమాదం ఎక్కువగా లేదు. ఒమిక్రాన్‌ సుమారు 20నెలలుగా ఉండగా.. ఇన్ఫెక్షన్‌ విషయంలో గణనీయంగా మార్పులేదు. ఈ పరిస్థితుల్లో కొత్త వేరియంట్లు ఏదైనా తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశాలు చాలా తక్కువ అని నిపుణులు పేర్కొంటున్నారు. గతంలో పెద్ద సంఖ్యలో జనం ఒమిక్రాన్‌ బారినపడ్డారు. కాబట్టి కొత్త వేరియంట్ల నుంచి వ్యాధి తీవ్రత ప్రమాదం పెంచే అవకాశాలు తక్కువని పేర్కొన్నారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కొత్త వేరియంట్‌ల బెదిరింపుల దృష్ట్యా, దాన్ని లక్ష్యంగా చేసుకుని కొత్త వ్యాక్సిన్‌లను తయారు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) నిపుణుల అభిప్రాయం ప్రకారం.. సెప్టెంబర్‌ చివరి నాటికి కొత్త వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అయితే, ఇంకా ఎఫ్‌డీఏ వాటిని ధ్రువీకరించలేదు.