అంతరిక్ష పరిశోధన కేంద్రంకు నలుగురు వ్యోమగాములు

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వుండి ప్రయోగాలు చేసేందుకు గానూ నాలుగు దేశాల నుండి నలుగురు వ్యోమగాములు శనివారం బయలుదేరి వెళ్ళారు. స్పేస్‌ ఎక్స్‌ కేప్స్యూల్‌లోని ప్రయోగశాలకు వారు ఆదివారం చేరతారు. మార్చి నుండి అక్కడే వుంటూ ప్రయోగాలు చేసిన నలుగురు వ్యోమగాములు భూమికి తిరిగి వచ్చేస్తారు. 

వారి స్థానంలో ఈ నలుగురు వెళుతున్నారు. శనివారం తెల్లవారు జామున కెన్నడీ స్పేస్‌ సెంటర్‌ నుండి రాకెట్‌ను ప్రయోగించారు. ఇందులో నాసా వ్యోమగామితో పాటూ డెన్మార్క్‌, జపాన్‌, రష్యాలకు చెందిన వ్యోమగాములు వున్నారు. 

ఇప్పటివరకు స్పేస్‌ ఎక్స్‌ టాక్సీ ఫైట్‌ల్లో ప్రతీసారీ నాసాకు చెందిన ఇద్దరు లేదా ముగ్గురు వ్యోమగాములు వుండేవారు, మొదటిసారిగా ఇప్పుడే ఒక్కొక్కరూ ఒక్కో దేశానికి చెందిన వారున్నారు. ఉమ్మడి లక్ష్యంతో ఐక్య బృందంగా వెళుతున్నామని నాసాకు చెందిన జాస్మిన్‌ మొగబెలీ రోదసీ స్టేషన్‌ నుండి వ్యాఖ్యానించారు.

వీరందూ ఆరు మాసాల పాటు రోదసీలో వుంటారు. రోదసీని అన్వేషించాలంటే మనందరం కలిసి కట్టుగా కృషి చేయాల్సిన అవసరం వుందని యురోపియన్‌ స్పేస్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ జనరల్‌ జోసెఫ్‌ అచాబచర్‌ బయలుదేరడానికి ముందుగా వ్యాఖ్యానించారు. రోదసీ అనేది అందరినీ, అంతర్జాతీయ సహకారం చాలా కీలకమని అన్నారు.