తమిళనాడులో తిరిగి పుంజుకుంటున్న ఎల్టీటీఈ!

శ్రీలంకలో ఎల్టీటీఈ సాయుధ తిరుగుబాటు చేస్తున్న సమయంలో దాని ప్రభావం ఎక్కువగా పొరుగున ఉన్న తమిళనాడుపై పడింది. వారికి భారత సైన్యమే ఆయుధ శిక్షణ ఇవ్వడం, ఆయుధాలను సమకూర్చడంతో వారా ఆయుధాలను భారత్ లోని తీవ్రవాద గ్రూప్ లకు అమ్ముకొని, మనదేశంలో సహితం తీవ్రవాద కార్యకలాపాలు విస్తరించేందుకు కారణమయ్యారు.
 
చివరకు మన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్యకు దారితీయడం తెలిసిందే. తమిళనాడులోని కొన్ని రాజకీయ పార్టీలు, నేతలు బహిరంగంగా  ఎల్టీటీఈ హింసాయుత కార్యకలాపాలకు మద్దతు ప్రకటించారు. అయితే, శ్రీలంకలో ఎల్టీటీఈ నేత ప్రభాకర్ ను తుదముట్టించడంతో వారి కార్యకలాపాలు చాలావరకు కట్టడి అయ్యాయి. తమిళనాడులో సహితం కొంతమేర ప్రశాంతత నెలకొంది. 
 
అయితే, సుమారు ఒకటిన్నర దశాబ్దం తర్వాత తిరిగి ఎల్టీటీఈ కదలికలు మొదలవడం, అందులో భాగంగానే ఇటీవల ఆయుధాల స్మగ్లింగ్‌ పెరగడం కేంద్ర నిఘా వర్గాలకు ఆందోళన కలిగిస్తున్నది. దానితో రాష్ట్రంలో  శ్రీలంక తమిళుల జాడలున్న అన్నిచోట్లా నిఘా పటిష్ఠం చేసినట్లు తెలుస్తోంది.  శ్రీలంకలో మళ్లీ నిషేధిత ఉగ్రవాద సంస్థ ఎల్టీటీఈకి నూతన జవసత్వాలు కల్పించే దిశగా పాకిస్థాన్‌ నుంచి, రాష్ట్రం నుంచి భారీ ఎత్తున ఆయుధాల స్మగ్లింగ్‌ జరుగుతోందని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. 
 
తిరుచ్చి శ్రీలంక శరణార్థుల శిబిరంలో తలదాచుకుంటున్న శ్రీలంకవాసులు కొందరికి ఆయుధాల స్మగ్లింగ్‌తో సంబంధాలున్నట్లు వెల్లడైన సమాచారం ఆధారంగా ఇటీవల ఎన్‌ఐఏ అధికారులు వలసరవాక్కంలో 13 మందిని అరెస్టు చేశారు. వీరికి 2021లో కేరళలోని విళింజం సముద్రతీరంలో మారణాయుధాలతో కొట్టుకు వచ్చిన పడవ కేసుతో సంబంధం ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించారు. 
 
ఈ నేపథ్యంలోనే శ్రీలంకకు మారణాయుధాలను అక్రమంగా తరలించారనే నేరారోపణలపై స్థానిక సేలయూరులో దాగిన ఆదిలింగం అనే వ్యక్తిని ఎన్‌ఐఏ అధికారులు అరెస్టు చేశారు. ఇతడికి పాకిస్థాన్‌ నుంచి శ్రీలంకకు మారణాయుధాలను తరలిస్తున్న ముఠా నాయకులతో సంబంధాలు ఉన్నట్లు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. తమిళనాడులో ఎల్టీటీఈ పునరుద్దరణకు పాకిస్తాన్ నిఘా విభాగం ఐఎస్ఐ విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. 
 
పాకిస్థాన్‌కు చెందిన హాజీ సలీం అనే మారణాయుధాల స్మగ్లర్‌కు ఈ ఆదిలింగం శ్రీలంకకు కేరళ మీదుగా మారణాయుధాలను తరలించేందుకు అన్ని విధాలా సహకరించినట్లు అధికారులు తెలుసుకున్నారు. శ్రీలంకలో ఎల్టీటీఈ ఉగ్రవాద సంస్థకు మళ్లీ నూతన జవసత్వాలు కల్పించేదిశగానే ఆదిలింగం ఈ మారణాయుధాల అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నాడని ఎన్‌ఐఏ అధికారులు చెబుతున్నారు. 
 
ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకునే కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నిఘా వేస్తున్నారు. ముఖ్యంగా శ్రీలంక తమిళులు అధికంగా నివసించే ప్రాంతాల్లోనూ, శ్రీలంక శరణార్థులు నివసిస్తున్న పునరావాస కేంద్రాల వద్ద నిఘాను తీవ్రతరం చేశారు. 
 
చెన్నై, తిరుచ్చి, కోయంబత్తూరు, మదురై తదితర నగరాల్లోని యువకులను ఎల్టీటీఈలో సభ్యులుగా చేర్చేందుకు కూడా ఆదిలింగం, అతని  అనుచరులు తీవ్రంగా ప్రయత్నించినట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. దీనితో కేంద్ర, రాష్ట్రాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ విభాగం అధికారులు, క్యూబ్రాంచ్‌ పోలీసులు, సముద్రతీర భద్రతా దళం సభ్యులతో కలసి రాష్ట్రమంతటా తీవ్ర నిఘా వేస్తున్నారు.