కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కుదురైంది. ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్హతపై కేజ్రీవాల్ చేసిన వ్యంగ్యాస్త్రాల మీద గుజరాత్ యూనివర్సిటీ దాఖలు చేసిన కేసులో ఆయనకు ఊరట లభించలేదు. ఈ కేసులో తనపై చర్యలు తీసుకోకుండా విచారణపై స్టే విధించాలని కోరుతూ సుప్రీంలో ఆయన పిటిషన్ దాఖలు చేయగా దాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. 
 
సంబంధిత కేసు ఇప్పటికీ గుజరాత్ హైకోర్టు పరిధిలోనే ఉందని, పైగా ఈ నెల 29న ఇది విచారణకు రానుందని, ఈ దశలో తాము క్లయింట్ అప్పీలును స్వీకరించడం కుదరదని న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా, ఎస్‌విఎన్ భట్టితో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఫిర్యాదీలు తమ సమస్య ఏదైనా సంబంధిత హైకోర్టుకు తెలియచేసుకోవచ్చునని, దీనిపై గుజరాత్ యూనివర్శిటీ కూడా హైకోర్టునే ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు.
 
కాగా,  గుజరాత్ యూనివర్శిటీ నుంచి మోడీ డిగ్రీ పట్టా పొందారని చెపుతున్నారని, ఈ పట్టా వివరాలు తమకు అందించాలని ఆప్ నేత ఆర్టీఐ యాక్ట్ పరిధిలో కేజ్రీవాల్ అభ్యర్థించగా , వివరాల సమర్పణకు చీఫ్ ఇన్‌ఫర్మేషన్ కమిషనర్ వర్శిటీ అధికారులను ఆదేశించారు. 
 
అయితే ఈ ఆదేశాలను గుజరాత్ హైకోర్టు నిలిపివేసింది. ఈ దశలోనే కేజ్రీవాల్ , సంజయ్ సింగ్‌లు చేసిన వ్యాఖ్యలు ప్రధానిని డిగ్రీ కోణంలో కించపర్చేవిగా ఉన్నాయనే విషయం కోర్టులో విచారణకు వచ్చింది. ఆయన చేసిన వ్యంగ్యాస్త్రాలు తమ విశ్వవిద్యాలయానికి పరువుకి నష్టం కలిగించాయని పేర్కొంటూ ఆయనపై ఆ గుజరాత్ యూనివర్సిటీ క్రిమినల్ పరువు నష్టం కేసు వేసింది. 
 
ఈ కేసులో విచారణ నిమిత్తం గుజరాత్‌ మెట్రోపాలిటన్‌ కోర్టుకు హాజరుకావాల్సిందిగా న్యాయస్థానం కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. అయితే,  కేజ్రీవాల్ ఈ సమన్లను సవాలు చేస్తూ సెషన్స్‌ కోర్టులో రివిజన్‌ అప్లికేషన్‌ దాఖలు చేశారు.  దీనిని సెషన్స్ కోర్టు తిరస్కరించడంతో కేజ్రీవాల్ గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించారు. అక్కడ కూడా నిరాశ ఎదురైంది. స్టే ఇవ్వలేమని తీర్పునిస్తూ తదుపరి విచారణని వాయిదా వేసింది. ఇంతలో కేజ్రీవాల్ సుప్రీంకోర్టుని ఆశ్రయించగా అక్కడా ఆయనకు ఎదురుదెబ్బే తగిలింది.

మరోవైపు ప్రధాని మోదీకి సంబంధించిన డిగ్రీ సర్టిఫికెట్ వివరాలను కేజ్రీవాల్‌కు ఇవ్వాలంటూ కేంద్ర సమాచాన కమిషన్ ఏడేళ్ల క్రితం ఆదేశాలు ఇవ్వగా, దాన్ని గుజరాత్ హైకోర్టు ఇప్పటికే తోసిపుచ్చింది. ప్రధాని సర్టిఫికెట్ కేజ్రీవాల్‌కి చూపించాల్సిన అవసరం లేదని ఈ ఏడాది మార్చిలో పేర్కొంది. ఈ కేసులో సమాచార హక్కు చట్టాన్ని కేజ్రీవాల్ దుర్వినియోగం చేశారంటూ ఆయనకు రూ.25 జరిమానా సైతం విధించింది.