రాష్ట్రపతి పాలన.. పంజాబ్ సీఎం మాన్ కు గవర్నర్ హెచ్చరిక

కొంతకాలం నుంచి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్, గవర్నర్ బన్వరీలాల్ పురోహిత్ ల మధ్య కొనసాగుతున్న లేఖల యుద్ధం ఇప్పుడు మరింత ముదిరింది. శుక్రవారం సీఎంకు గవర్నర్ గట్టి హెచ్చరిక చేశారు.  గతంలో తాను రాసిన లేఖలకు సమాధానం ఇవ్వకపోతే రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని హెచ్చరికలు జారీ చేశారు. 

అంతేకాదు, క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమిస్తానని కూడా తెలిపారు. తాను రాసిన లేఖలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంపై తాను కలత చెందానని పేర్కొన్న ఆయన రాజ్యాంగ యంత్రాంగం వైఫల్యంపై రాష్ట్రపతికి నివేదించగలనని స్పష్టం చేశారు. ఈమేరకు ఆయన మాన్‌కు పంపిన లేఖను శుక్రవారం మీడియాకు విడుదల చేశారు.

‘గతంలో నేను మీకు రాసిన లేఖలకు ప్రత్యుత్తరమే లేదు. దీనిపై నేను ఆవేదన చెందాను. రాష్ట్రంలో డ్రగ్స్‌ సమస్య తీవ్రంగా మారింది. శాంతిభద్రతలు క్షీణించాయి. దీనిపై ప్రభుత్వ పరంగా మీరు తీసుకున్న చర్యలను నాకు తెలియజేయపోతే, రాష్ట్రంలో రాజ్యాంగ ప్రక్రియ వైఫల్యంపై ఆర్టికల్‌ 356 ప్రకారం రాష్ట్రపతికి నివేదికను పంపిస్తా. ఐపీసీ 124 ప్రకారం క్రిమినల్‌ చర్యలు చేపడతాను. దీనిపై నేను తుది నిర్ణయం తీసుకోకముందే నేను పంపించిన లేఖలకు మీరు జవాబు ఇవ్వాలని సూచిస్తున్నా, హెచ్చరిస్తున్నా’ అని బన్వరీలాల్‌ పేర్కొన్నారు.

గవర్నర్‌ నివేదికను అనుసరించి ఆర్టికల్‌ 356 ప్రకారం ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉంది. పలు విషయాలపై ప్రభుత్వాధినేతకు తాను లేఖలు రాస్తూ వస్తున్నా, స్పందన లేదని, దీనిని సీరియస్‌గా తీసుకోవల్సి ఉంటుందని గవర్నర్ స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం ఉండదు, తర్వాత కూడా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని పురోహిత్ ఘాటుగా సిఎం మాన్‌ను హెచ్చరించారు

రాజ్యాంగంలోని ఆర్టికల్ 356, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 ప్రకారం  తాను తుది నిర్ణయం తీసుకోవడానికి ముందే లేఖలపై సమాధానం ఇవ్వాలని సీఎం మాన్‌కు గవర్నర్ పురోహిత్ సూచించారు. ఇదే సమయంలో రాష్ట్రంలో డ్రగ్స్ సమస్యకు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుందోనన్న విషయాలపై కూడా సమాచారం ఇవ్వాలని కోరారు. 

ఒకవేళ ఇవ్వకపోతే రాజ్యాంగం, చట్టపరంగా చర్యలు తీసుకోవడం తప్ప తనకు వేరే మార్గం ఉండదని గవర్నర్ హెచ్చరించారు. డ్రగ్స్ వినియోగంపై తనకు వివిధ ఏజెన్సీల నుంచి నివేదికలు అందాయనని పేర్కొంటూ ఫార్మసీలు, ప్రభుత్వ నియంత్రణలో ఉన్న మద్యం దుకాణాల్లో కూడా అవి ఎలా దొరుకుతున్నాయని ప్రశ్నించారు. 

పంజాబ్‌లో ప్రతి ఐదుగురిలో ఒకరు డ్రగ్స్‌కు బానిసలుగా ఉన్నారని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇటీవల ఇచ్చిన నివేదికను సైతం ఆ లేఖలో గవర్నర్ ఉటంకించారు. మరోవైపు.. గవర్నర్ జారీ చేసిన ఈ హెచ్చరికలపై ఆమ్ ఆద్మీ పార్టీ నేత మల్విందర్ సింగ్ కాంగ్ స్పందించారు. తమది ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వమని, ఇలా ఎన్నుకోబడిన వ్యక్తులకు భారత రాజ్యాంగం అధికారం ఇస్తుందని పేర్కొన్నారు. 

తాను రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని గవర్నర్ ఇచ్చిన బెదిరింపులతో బీజేపీ అజెండాని బయటపెట్టారని ఆరోపించారు. ఇదిలావుండగా  ఆప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై గవర్నర్ పలుమార్లు ప్రశ్నిస్తూ లేఖలు రాశారు. కానీ అందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనలు రాలేదు. గతంలోనూ ఈ విషయంపై విమర్శలు చేసిన గవర్నర్ ఇప్పుడు సహనం కోల్పోయి రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేస్తానని హెచ్చరికలకు దిగారు.