వినుకొండ ఎమ్మెల్యే ఆక్రమణలపై విచారణకు ఆదేశం

అధికార పార్టీ ఎమ్మెల్యే భూ ఆక్రమణలకు పాల్పడ్డారని దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పల్నాడు జిల్లా వినుకొండలో 175 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆక్రమించారంటూ బ్రాహ్మణపల్లికి చెందిన కీర్తిపాటి వెంకటేశ్వర్లు హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. 
 
ఈ పిటిషన్‌ విచారించిన చీఫ్ జస్టిస్ దీరజ్ సింగ్‌ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయిల ధర్మాసనం పిటిషనర్ వాదనలతో ఏకీభవిస్తూ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.  బ్రాహ్మణపల్లె గ్రామ పరిధిలోని వివిధ సర్వే నంబర్లలోని 175 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్ భూములను మాల్పూరి ఆగ్రోటెక్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ, వినుకొండ వైసిపి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి చెందిన శ్రీవత్స ఫుడ్‌ పార్క్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఆక్రమించాయంటూ ప్రజాహిత వ్యాజ్యంపై హైకోర్టు విచారణ జరిపింది.

ప్రభుత్వ భూముల పరిరక్షణ కోసం హైకోర్టు గతంలో జారీ చేసిన ఉత్తర్వులకు అనుగుణంగా  వినుకొండ భూముల ప్రస్తుత విషయం లోనూ వ్యవహరించాలని పల్నాడు జిల్లా కలెక్టర్‌తో పాటు రెవిన్యూ అధికారులకు స్పష్టం చేసింది. ఆక్రమణదారులకు ముందుగా నోటీసు ఇవ్వాలని, విచారణ పూర్తి చేసి మూడు నెలల్లో ఆక్రమణల తొలగింపునకు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.

గతంలో ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం శ్రీవత్స ఫుడ్‌‌పార్క్‌ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ, వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, మాల్పూరి అగ్రోటెక్ సంస్థ ఎండీ లక్ష్మణస్వామి, తదితరులకు నోటీసులు జారీచేసింది. పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ వాదనలు వినిపిస్తూ రెవెన్యూ రికార్డుల ప్రకారం వినుకొండలో ఉన్నవి ఇప్పటికీ ప్రభుత్వ భూములేనని తెలిపారు.

బ్యాంకుల్లో ప్రభుత్వ భూములను తాకట్టు పెట్టి రూ.50 కోట్ల రుణం పొందారని చెప్పారు. ఈ ఆక్రమణలపై విచారణ చేపట్టి తక్షణమే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సిందిగా రెవెన్యూ అధికారులను హైకోర్టు ఆదేశించడం కలకలం రేపింది. భూ ఆక్రమణల వ్యవహారంలో అధికార పార్టీ ఎమ్మెల్యే ప్రమేయం బయటపడటం చర్చనీయాంశంగా మారింది.