ఏపీలో 2022 నుంచి తొలగించిన ఓట్ల రీవెరిఫికేషన్

ఏపీలో భారీ ఎత్తున ఓట్లను తొలగిస్తున్నారనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ నేతలు బూత్ లెవెల్ అధికారులు (బీఎల్వో)పై ఒత్తిడి తెచ్చి ఓట్లను విచ్చలవిడిగా తొలగిస్తున్నట్లు ఈసీకి భారీగా ఫిర్యాదులు అందాయి. విశాఖ జిల్లాలో తొలగించిన ఓట్లపై ఈసీకి విపక్షాలు భారీగా ఫిర్యాదులు చేశాయి.
 
దీంతో ఈ నెలలో ఈసీ ఆదేశాల మేరకు సమీక్ష నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కీలక ఉత్తర్వులు ఇచ్చారు. రాష్ట్రంలో గత ఏడాద జనవరి నుంచి ఓటర్ల జాబితాలో నుంచి తొలగించిన ఓట్లను తిరిగి పరిశీలించాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారులైన కలెక్టర్లు, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. 
 
ఇందుకోసం కొన్ని మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. వీటిని అనుసరించి ఈ తొలగించిన ఓట్లను తిరిగి పరిశీలించాలని సూచించింది. దీంతో అధికారులు ఇప్పుడు సీఈవో ఆదేశాల అమలుకు సిద్ధమవుతున్నారు. ఈ ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఓటర్ల జాబితా స్వచ్ఛంగా ఉండేందుకు ఈసీ చర్యలు చేపడుతున్నట్లు సీఈవో ముకేష్ కుమార్ మీనా ఓ ప్రకటనలో తెలిపారు. 
 
విశాఖలో ఈ నెల 6న జరిపిన సమీక్షలో గత ఏడాది జనవరి 6వ తేదీ నుంచి తొలగించిన ఓట్లను తిరిగి పరిశీలించాలని ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ నెల 2, 3 తేదీల్లో ఈసీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ప్రక్రియ చేపట్టామని పేర్కొన్నారు. ఓట్ల తొలగింపుకు సంబంధించి అన్ని భౌతిక ఫైళ్లను పరిశీలించాలని, అలాగే ఈ ప్రక్రియలో ఈసీ నిబంధనల్ని పాటించారా లేదా అన్నది కూడా చూడాలని ఈ నెల 9న అన్ని జిల్లాల కలెక్టర్లకు మెమో జారీ చేశామని తెలిపారు.
ఈ మేరకు క్షేత్రస్ధాయిలో బీఎల్వోలు, ఈఆర్వోలు తొలగించిన ఓట్లను స్వయంగా పరిశీలించి ఆధారాలతో సహా ఈ నెల 30వ తేదీలోగా రిపోర్ట్ పంపించాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా ఆదేశాలు ఇచ్చారు. అలాగే ఈ రీవెరిఫికేషన్ కోసం డీఈవోలు జిల్లాల్లో ప్రత్యేక అధికారుల్ని నియమించాలని ఆదేశించారు. 

 
జిల్లాలో ఈఆర్వోలు కనీసం వెయ్యి తొలగించిన ఓట్లను ర్యాండమ్ పద్ధతిలో పరిశీలించాలని, అలాగే నియోజకవర్గానికి 500 ఓట్ల చొప్పున డీఈవోలు నియమించే ప్రత్యేకాధికారులు పరిశీలించాలని ఆదేశించారు. అలాగే జిల్లా కలెక్టర్, డీఈవోలు స్వయంగా కనీసం 100 ఓట్లను ఇలా పరిశీలించాలని స్పష్టం చేశారు.