
హైదరాబాద్ చేప మందు పంపిణీతో గుర్తింపు పొందిన బత్తిని సోదరుల్లో ఒకరైన బత్తిని హరినాథ్ గౌడ్ మృతిచెందారు. అస్తమా రోగులకు చేపమందు ప్రసాదం వేస్తూ గుర్తింపు పొందిన బత్తిని సోదరుల్లో ఒకరైన హరినాథ్ గౌడ్ (84) అనారోగ్యంతో బాధపడుతూ బుధవారం రాత్రి 10 గంటలకు కవడిగుడాలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
చేప మందుతో గుర్తింపు పొందిన బత్తిని హరినాథ్ గౌడ్ కొంతకాలంగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఏటా మృగశిర కార్తె రోజున హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బత్తిని కుటుంబ సభ్యులు చేప మందు పంపిణీ చేస్తుంటారు.
చేప ప్రసాదం కోసం తెలంగాణ నలు మూలల నుంచి కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో నగరానికి వస్తుంటారు. 1847లో హైదరాబాద్ సంస్థానంలో చేప మందు ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. అప్పట్లో వీరన్న గౌడ్ అనే వ్యక్తి ప్రతి మృగశిర కార్తె ముందు రోజు నుంచి చేప ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
ఆయన తర్వాత కుమారుడు బత్తిని శివరామ గౌడ్, అతని కుమారుడు బత్తిని శంకర్‌గౌడ్ ఈ ప్రసాదాన్ని ఏటా వేస్తూనే ఉన్నారు. శంకర్‌గౌడ్, సత్యమ్మ దంపతుల ఐదుగురు కుమారుల్లో బత్తిని హరినాథ్ గౌడ్, బత్తిని ఉమామహేశ్వర్ గౌడ్ వారి కుటుంబ సభ్యులు కలిసి చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు.
గత 176 ఏళ్లుగా చేప మందు పంపిణీ కొనసాగుతోంది. కరోనా కారణంగా చేప ప్రసాదం పంపిణీ రెండేండ్ల పాటు నిలిచిపోయింది. గత ఏడాది నుంచి చేప మందుకు కోసం వచ్చేవారికి ప్రభుత్వమే అన్ని ఏర్పాట్లు చేస్తోంది. బత్తిని హరినాథ్ గౌడ్ మృతికి పలువురు సంతాపం తెలిపారు.
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!