నా జీవితం ధన్యమైంది… ప్రధాని మోదీ

బ్రిక్స్ సమావేశంలో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ జొహెన్నస్‌బర్గ్ నుంచి వర్చువల్ విధానంలో చంద్రయాన్-3 కార్యక్రమాన్ని వీక్షించారు. విక్రమ్ ల్యాండర్ చంద్రుని ఉపరితలంపై అడుగిడిన వెంటనే మోదీ కరతాళ ధ్వనులు చేస్తూ, జాతీయ జెండాను ఊపుతూ హర్షం ప్రకటించారు. 
 
ఇది మునుపెన్నడూ లేనంత గొప్ప అద్భుత క్షణాలని పేర్కొన్నారు. అమృత్‌కాలం ప్రారంభంలో గొప్ప విజయం సాధించామన్నారు. ఇది నవ భారతానికి నాంది అని తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “చంద్రయాన్‌-3 విజయంతో నా జీవితం ధన్యమైంది. భారత్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ క్షణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూశా. ఈ అద్భుత విజయం కోసం 140 కోట్ల ప్రజలు ఎదురుచూశారు” అంటూ హర్షం ప్రకటించారు. 
 
“చంద్రయాన్ విజయం నవభారత జయధ్వానం. ఈ విజయం దేశం గర్వించే మహత్తర క్షణాలు. ప్రపంచంలో తొలిసారిగా చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టాం. అమృత కాలంలో తొలి ఘన విజయం. బ్రిక్స్ సమావేశాల్లో ఉన్నా నా మనసంతా చంద్రయాన్ పైనే ఉంది” అని పేర్కొన్నారు.  భూమిని భూమాత అంటామని, చంద్రుడిని చందమామ అంటామని ప్రధాని గుర్తు చేశారు. చందమామ చాలా దూరమని అంటారని, కానీ ఇకపై చందమామపై సరదాగా పర్యటనలు చేయడానికి సాధ్యమవుతుందని చెప్పారు. భూమిపై సంకల్పం చేసి, చందమామపై విజయం సాధించామని చెప్పారు. 

భారతీయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. భారత దేశం జీ20 ప్రెసిడెన్సీని నిర్వహిస్తున్న సంవత్సరంలో ఈ విజయం లభించిందని గుర్తు చేశారు. వసుధైక కుటుంబకం అనే నినాదంతో ఈ సంవత్సరం జీ20 సమావేశాలు జరుగుతున్నాయని చెబుతూ మానవుడి కేంద్రంగా చంద్రయాన్-3 జరిగిందని తెలిపారు. చంద్రుని దక్షిణ ధ్రువానికి చేరిన తొలి దేశం భారతదేశమని చెప్పారు. మనందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని పేర్కొంటూ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయాలను సొంతం చేసుకోవడం గురించి తెలుసుకోవచ్చునని చెప్పారు. చంద్రయాన్-3 విజయం యావత్తు మానవాళి సాధించిన విజయమని తెలిపారు.