చంద్రుడిపై చంద్రయాన్ -3.. చరిత్ర సృష్టించిన భారత్

భారత్‌ మరోచరిత్ర సృష్టించింది. అంతరిక్ష పరిశోధనలో తనదైన ముద్ర వేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 విజయవంతమైంది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ విక్రమ్ చంద్రుడి దక్షిణ ధృవంపై సాఫ్ట్‌ ల్యాండ్‌ అయ్యింది.  సుమారు 40 రోజులపాటు ప్రయాణించిన ల్యాండర్ విక్రమ్ సక్సెస్ ఫుల్ గా రోవర్ ప్రజ్ఞాన్ ను చంద్రుడిపై దింపింది.
 
దీంతో ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో ఇస్రో ప్రధాన కార్యాలయంలోని శాస్త్రవేత్తలు ఆనందంతో పొంగిపోయారు. ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది మంది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. చంద్రయాన్‌ -3 విజయం కోసం ఎందరో భారతీయులు ప్రత్యేక పూజలు, హోమాలు కూడా చేశారు. 
 
గంట‌ల త‌ర‌బ‌డి ఉత్కంఠ‌కు తెరదించుతూ మూన్ మిష‌న్ విజయవంతం కావ‌డంతో యావ‌త్ దేశం సంబ‌రాల్లో మునిగితేలింది. చంద్ర‌యాన్ 3 సాఫ్ట్ ల్యాండింగ్ అనంత‌రం బెంగ‌ళూర్‌లోని మిష‌న్ కంట్రోల్ క్యాంప‌స్ వేదిక‌గా శాస్త్ర‌వేత్త‌ల బృందాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మ‌న్ ఎస్ సోమ్‌నాధ్ మాట్లాడుతూ చంద్ర‌యాన్-3 విజ‌య‌వంతం కావ‌డంతో భార‌త్ ఇప్పుడు చంద్రుడిపై కాలుమోపింద‌ని ప్ర‌క‌టించారు.
 
బుధవారం సాయంత్రం 5.44 గంటలకు విక్రమ్ ల్యాండర్‌.. నిర్దేశించిన ప్రాంతానికి చేరుకుంది. ఆ సమయంలోనే ల్యాండింగ్‌ మాడ్యూల్‌కు ఆటోమేటిక్‌ ల్యాండింగ్‌ సీక్వెన్స్‌ కమాండ్‌ను ఇస్రో పంపించింది. ఈ కమాండ్‌ను అందుకున్న ల్యాండర్‌.. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెనస్ సాయంతో సాఫ్ట్‌ ల్యాండింగ్‌ ప్రారంభించింది. తన 4 థ్రాటల్‌బుల్‌ ఇంజిన్లను ప్రజ్వలించి క్రమంగా వేగాన్ని తగ్గించుకుంది. రఫ్‌ బ్రేకింగ్‌ దశను సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుని చంద్రుడి ఉపరితలం నుంచి 7.4 కిలోమీటర్ల ఎత్తుకు చేరింది.

అనంతరం దిశను మార్చుకున్న ల్యాండర్‌.. ల్యాండర్‌ పొజిషన్‌ డిటెక్షన్‌ కెమెరా, కేఏ బ్యాండ్‌ అండ్‌ లేజర్‌ బేస్డ్‌ అల్టీమీటర్లు, లేజర్‌ డాప్లర్‌ వెలోసీమీటర్‌ వంటి పరికరాలతో తన మార్గాన్ని నిర్దేశించుకుంది. ఆ తర్వాత దశల వారీగా నెమ్మదిగా జాబిల్లి ఉపరితలానికి కొన్ని మీటర్ల ఎత్తులోకి చేరింది. చివరిగా ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశాన్ని ఎంచుకుని సక్సెస్‌ఫుల్‌గా చంద్రుడిపై అడుగు పెట్టింది.

 
  ఎంతో ఉత్కంఠతతో ప్రత్యక్ష్య ప్రసారాన్ని చూసిన కోట్లాది భారతీయులు పట్టరాని సంతోషానికి లోనయ్యారు. ప్రపంచంలో ఏ దేశానికి సాధ్యం కాని విధంగా చంద్రుడి దక్షిణ ధృవంపై అడుగు పెట్టి.. అగ్రరాజ్యాలు సుసాధ్యం అని భావించిన దాన్ని భారత్ సాధ్యం చేసి.. జయహో భారత్ అనేలా చేసింది. చంద్రుడిపై దిగిన ల్యాండర్.. జాబిల్లి నిర్మాణం, అక్కడి వాతావరణం, పరిమాణంపై చంద్రయాన్‌ 3 పరిశోధించనుంది.
 
మరోవైపు భారత్‌ చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 పట్ల ప్రపంచ దేశాలు కూడా చాలా ఆసక్తిని చూపాయి. రష్యా చేపట్టిన మూన్‌ మిషన్‌ లూనా 25 రెండు రోజుల కిందట విఫలమైంది. ఆ దేశ ల్యాండర్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై కూలిపోయింది. ఈ తరుణంలో ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారి స్టాఫ్‌ ల్యాండింగ్‌ కావడంపట్ల పలు దేశాలు ఆశ్చర్యపోయాయి.  
 
చంద్రయాన్‌ -3 విజయవంతం కావడం పట్ల భారత్‌కు ప్రధానంగా ఇస్రోకు అభినందనలు తెలిపాయి. కాగా, ఇప్పటి వరకు చంద్రుడిపై దిగిన అమెరికా, రష్యా, చైనా తర్వాత భారత్‌ ఈ ఘనత దక్కించుకున్నది. అంతరిక్ష పరిశోధనల్లో చరిత్ర సృష్టించింది. చంద్రయాన్ 3 విజయవంతం కావడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబరాలు జరుపుకుంటున్నారు.
 
15 ఏళ్ల క్రితం చంద్రుడిపై నీరుందని మొదటి జాబిల్లి యాత్ర చంద్రయాన్ 1 తోనే గుర్తించిన భారత్.. చంద్రయాన్ 3 ప్రయోగంతో జాబిల్లి దక్షిణ ధ్రువంపై దిగిన తొలి దేశంగా నిలిచింది. చంద్రయాన్‌ 3 తో జాబిల్లిపై ఎవరూ వెళ్లని దారుల్లో వెళ్లి.. ఎవరూ చూడని దక్షిణ ధ్రువాన్ని ప్రపంచానికి చూపించింది. బుధవారం సాయంత్రం 6.03 గంటలకు విక్రమ్ ల్యాండర్‌ జాబిల్లిపై దిగ్విజయంగా కాలుమోపి.. భారత వైజ్ఞానిక సత్తాను ప్రపంచానికి చాటి చెప్పింది.