‘నా గమ్యాన్ని చేరుకున్నా’.. చంద్రయాన్ 3 సందేశం

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన మూన్‌ మిషన్‌ చంద్రయాన్‌-3 ల్యాండర్‌ విక్రమ్‌ చంద్రుడి దృక్షిణ ధృవంపై విజయవంతంగా సాఫ్ట్‌ ల్యాండ్‌ అయిన అనంతరం ఇస్రోకు ఒక సందేశాన్ని చేరవేసింది. ‘నేను నా గమ్యాన్ని చేరుకున్నా. మీరు (భారత్‌, ఇస్రో) కూడా’. అన్న మెసేజ్‌ను పంపింది. ఇస్రో దీనిని ధృవీకరించింది. 
 
చంద్రయాన్-3 చంద్రుడిపై విజయవంతంగా ల్యాండ్ అయ్యిందని తెలిపింది. ‘భారతదేశానికి అభినందనలు’ అని ట్వీట్‌ చేసింది. మరోవంక, సుమారు నాలుగు గంటల తర్వాత  చంద్రయాన్‌-3 ప్రయోగంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ఇస్రో చేపట్టిన ఈ ప్రయోగానికి పరిపూర్ణ విజయాన్ని చేకూరుస్తూ రోవర్‌ ప్రజ్ఞాన్‌ ఉపరితలంపై విజయవంతంగా అడుగుపెట్టింది. 
 
భారతీయులను ఆనంద డోలికల్లో ముంచుతూ చంద్రుడి గుట్టు విప్పడంలో ముఖ్య పాత్ర పోషించే, పరిశోధనల్లో కీలకంగా వ్యవహరించే ప్రజ్ఞాన్‌ రోవర్‌ చంద్రుడి ఉపరితలంపై కాలు మోపింది. సెకనుకు ఒక్కో సెం.మీ వేగంతో ఇది ల్యాండర్‌ ర్యాంపు ద్వారా వడివడిగా రాత్రి 20 గంటల ప్రాంతంలో బయటకు వచ్చింది. చంద్రయాన్-3 ల్యాండింగ్ అనంతరం విక్రమ్ ల్యాండర్ తొలిసారి చంద్రుడి చిత్రాలను తీసింది.
విక్రమ్ తీసిన ఫోటోలను ఇస్రో తన అధికారిక ఎక్స్(ట్విట్టర్) హ్యాండిల్‌లో ట్వీట్ చేసింది. బెంగళూరు ఇస్రో కేంద్రంతో చంద్రయాన్-3 ల్యాండర్ అనుసంధానమైంది. ఇస్రో సాధించిన ఘనతకు గుర్తుగా చంద్రుడి ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ దేశ జాతీయ చిహ్నంతో పాటు ఇస్రో లోగోను ముద్రించనుంది. ఇందుకు తగినట్లు రోవర్ ఆరు చక్రాలను డిజైన్ చేశారు.
ఇందులో కుడి చక్రాలు ఇస్రో లోగోను, ఎడమవైపు చక్రాలు జాతీయ చిహ్నాన్ని ముద్రిస్తాయి.పద్నాలుగు రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై ప్రగ్యాన్ రోవర్ సంచరిస్తూ ల్యాండర్‌కు కమ్యూనికేట్ చేస్తుంది. ప్రగ్యాన్ రోవర్‌లోని రెండు పేలోడ్‌లు చంద్రుడిపై ఉన్న వాతావరణ పరిస్థితులు, ఉపరితల నిర్మాణం వంటి అంశాలను పరిశీలిస్తాయి. అలాగే మట్టి, రాళ్లలో ఉన్న రసాయనాలను గుర్తించి సమాచారాన్ని విశ్లేషిస్తాయి.
ఈ అంకంతో విక్రం ల్యాండర్ మోడ్యూల్ బాధ్యత ముగిసింది. ఇక ప్రజ్ఞాన్ రోవర్ పాత్ర ప్రారంభమవుతుంది. విక్రం ల్యాండర్ సేఫ్ ల్యాండింగ్ తర్వాత ల్యాండర్ సైడ్ ప్యానెల్ ఓపెన్ అయ్యి, ర్యాంప్ పై ఉపరితలంపైకి చేరుతుంది. ఆ ర్యాంప్ మీదుగా ఆరు చక్రాల ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడిపై దిగి తన ప్రయాణం ప్రారంభిస్తుంది. 
 
దాదాపు 14 రోజుల పాటు (ఒక ల్యూనార్ డే) చంద్రుడి ఉపరితలంపై కలియ తిరుగుతుంది. తనలోని అత్యాధునిక కెమెరాలతో ఫొటోలను తీస్తుంది. 3డీ టెక్నాలజీతో మ్యాపింగ్ చేస్తుంది. తనపై ఉన్న సోలార్ ప్యానెల్స్ ద్వారా అవసరమైన శక్తిని పొందుతుంది. ఎవరికీ తెలియని చంద్రుడి దక్షిణ ధృవం గుట్టు విప్పనున్నది. అక్కడి నేలలోని ఖనిజాలను గుర్తిస్తుంది. ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపనున్నది.