చంద్రయాన్ 3 పై ప్రకాష్ రాజ్ అనుచిత ట్వీట్!

ఎప్పుడూ ఎవ్వరో ఒక్కరిపై, ముఖ్యంగా బీజేపీ, ప్రధాని మోదీపై అనుచిత పోస్ట్ లను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ వార్తలలో నిలవడానికి ప్రయత్నిస్తుండే నటుడు ప్రకాష్ రాజ్ తాజాగా భారత దేశం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న చంద్రయాన్ 3 ప్రయోగించిన భారత అంతరిక్ష సంస్థ (ఇస్రో)పై అనుచిత పోస్ట్ చేసి అభాసుపాలయ్యారు. మొత్తం ప్రపంచంలో  మేటిగా భావిస్తున్న ఇస్రోపై ఇటువంటి అసందర్భపు పోస్ట్ చేయడం ఏమిటంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.

 ఇస్రో సంస్థ ప్రయోగించిన చంద్రయాన్ 3 గురించి ఒక వ్యంగ కార్టూను, అది కూడా బ్రేకింగ్ న్యూస్ అంటూ పోస్ట్ చేసాడు ప్రకాష్ రాజ్. అయితే మొదటి నుండి, బీజేపీని, ప్రధానమంత్రి మోదీని బాగా విమర్శిస్తూ వచ్చిన ప్రకాష్ రాజ్, ఈసారి ఇస్రో లాంటి సంస్థ చంద్రుడు మీదకి ప్రయోగించిన చంద్రయాన్ లాంటి దాని మీద కూడా విమర్శ ఏంటి అని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

ఇస్రో సంస్థ తన సాంఘీక మాధ్యమంలో చంద్రయాన్ 3 పంపిన ఫోటోస్ ని షేర్ చేసింది. చంద్రుడి మీద ఎక్కడ సరిగ్గా ల్యాండ్ అయితే బాగుంటుంది? అనే విషయంలో చంద్రయాన్ పంపిన ఫోటోస్ ని ఇస్రో సంస్థ పెడితే దానికి ప్రకాష్ రాజ్ ఒక వింతైన పోస్ట్ పెట్టాడు. బ్రేకింగ్ న్యూస్ అంటూ ఒక వ్యక్తి లుంగీ కట్టుకొని, కాఫీ కలుపుతూ (అదే పైనుండి కిందది కాఫీ కలుపుతారు కదా ఆలా వున్న పోజ్) వున్న ఫోటో పెట్టి, చంద్రుడి నుండి విక్రమ్ లాండర్ పంపిన మొదటి చిత్రం వచ్చింది అంటూ పోస్ట్ పెట్టాడు ప్రకాష్ రాజ్.

ఇది నెటిజన్స్ కి బాగా కోపం తెప్పించింది. ఇంకేమి ట్రోల్ చెయ్యడం మొదలెట్టారు. ఇస్రో లాంటి సంస్థ ఓ పార్టీకి చెందింది కాదని, ఒకవేళ చంద్రయాన్ 3 చంద్రుడి మీద సరిగ్గా ల్యాండ్ అయితే అది దేశం ఘన విజయం అంటూ చెప్పుకొచ్చారు. అది ఏ పార్టీ ఘనత కాదన పేర్కొంటూ చివరికి ప్రకాష్ రాజ్ అందరినీ ద్వేషించే పరిస్థితి వస్తుందని కూడా కొందరు హెచ్చరించారు.

 స్టాండ్ అప్ కమెడియన్ అపూర్వ గుప్త అయితే ప్రకాష్ రాజ్ ని ఒక మంచి టాలెంట్ నటుడువి అయ్యుండి ఇలా ప్రవర్తించడం బాగోలేదు అన్నారు. “ద్వేషంతో అసలు చిక్కు ఏంటంటే, నువ్వు ఒక మనిషి మీద ద్వేషం పెంచుకుంటే చివరికి నువ్వు అందరి మీద ద్వేషం పెంచుకుంటావు. నువ్వు అప్పుడు మనిషికి, భావజాలానికి, దేశంచేసే ఘనకార్యం వీటన్నిటి మధ్య తేడా తెలుసుకోలేక పోతావు, అన్నీ ఒకేలా కనపడతాయి,” అంటూ అప్పోర్వ గుప్త సున్నితంగా మందలించాడు.

కార్టూన్‌లో చిత్రించిన వ్యక్తి ఎవరో ఆయన స్పష్టం చేయనప్పటికీ, మాజీ ఇస్రో చీఫ్ కె. శివన్ అన్న అనుమానం కలుగుతోంది. దీనిపై  కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మండిపడుతూ “ఈ అవమానకరమైన ట్వీట్‌ను ఖండిస్తున్నాను. ఇస్రో విజయం భారత్ విజయం” అని పేర్కొన్నారు. 

ఇస్రో విజయాలను రాజకీయ ద్వేషం నుంచి దూరంగా చూడాలని ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ప్రపంచమంతా ఒక మైలురాయిగా భావిస్తున్న ఈ ప్రయోగాన్ని అపహాస్యం చేయకూడదని మరికొందరు విమర్శించారు. తప్పు చేస్తే తప్పును చెప్పడంలో తప్పులేదు కానీ, ఏది పడితే దాన్ని విమర్శించే ప్రయత్నం చేయకూడదని మరికొందరు నెటిజన్లు హితవు పలికారు.