మణిపూర్ హింసాకాండ బాధితులకు పరిహారం పెంచాలి

మణిపూర్‌ హింసాకాండలో నిరాశ్రయులైన బాధితులకు పరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఉందని మాజీ జడ్జి గీతా మిట్టల్‌ నేతృత్వంలోని కమిటీ స్పష్టం చేసింది. అలాగే అత్యవసరమైన డాక్యుమెంట్లను కూడా తిరిగి జారీ చేయాల్సి ఉందని తెలిపింది. పునరావాసం, పరిహారంపై జస్టిస్‌ గీతా మిట్టల్‌ నేతృత్వంలోని కమిటీ హింసాత్మక సంఘటనకు సంబంధించి మూడు నివేదికలను సమర్పించిందని సుప్రీంకోర్టు సోమవారం  వెల్లడించింది. 

జస్టిస్‌ గీతా మిట్టల్‌ కమిటీ పనితీరును సులభతరం చేసేందుకు శుక్రవారం ఆదేశాలు జారీ చేస్తామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ మూడు నివేదికల కాపీలను సంబంధిత న్యాయవాదులందరికీ అందించనున్నట్లు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డి.వై.చంద్రచూడ్‌, జస్టిస్‌ జె.బి పార్థివాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం తెలిపింది. 

కమిటీ కోసం సూచనలను క్రోడీకరించాల్సిందిగా బాధితుల్లో ఒకరి తరపున హాజరైన న్యాయవాది వృందా గ్రోవర్‌ని ఆదేశించింది. సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను నివేదికను పరిశీలించి.. ఈ విషయంలో సహకరించాలని సర్వోన్నత న్యాయస్థానం కోరింది.

”మణిపూర్‌ హింసాత్మక ఘటనల్లో పలువురు బాధితులు అత్యవసర డాక్యుమెంట్లను పోగొట్టుకున్నారు. బాధితులకు అత్యవసరమైన డాక్యుమెంట్లను తిరిగి జారీ చేయాల్సిన అవసరం ఉంది.  మణిపూర్‌ బాధితుల పరిహారాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. నోడల్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిపుణుడిని నియమించాలి” అని జస్టిస్‌ గీతా మిట్టల్‌ కమిటీ నివేదికలో సూచించినట్లు ధర్మాసనం తెలిపింది.

మణిపూర్‌ హింసాకాండపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ జరిపిన విషయం తెలిసిందే. విచారణ సందర్భంగా ముగ్గురు మాజీ మహిళా న్యాయమూర్తులతో కూడిన కమిటీని ఈ నెల 7న  నియమించింది. ఈ కమిటీకి మణిపూర్‌లో హింసాకాండ బాధిత ప్రజల కోసం నిర్వహిస్తున్న సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించి నివేదికను సమర్పించే బాధ్యతను అప్పగించింది.

జమ్మూ కాశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్‌ను కమిటీకి చైర్మన్‌గా నియమించారు. కమిటీలో జస్టిస్ (రిటైర్డ్) పీ జోషి, జస్టిస్ (రిటైర్డ్) ఆశా మీనన్‌ సైతం ఉన్నారు. కమిటీకి సహాయం అందించేందుకు, ఖర్చుల విషయంలో మార్గదర్శకాలను జారీ చేసింది. మణిపూర్‌లో క్రిమినల్‌ కేసుల దర్యాప్తును పర్యవేక్షించాలని మాజీ పోలీసు అధికారి దత్తాత్రే ‘దత్తా’ పద్సాల్గికర్‌కు ‘సుప్రీం’ బాధ్యతలు అప్పగించింది. కమిటీ సైతం నివేదికను త్వరలో సుప్రీంకోర్టకు సమర్పించనున్నది.