దక్షిణ ధ్రువం ఫొటోలు పంపిన విక్రమ్‌ ల్యాండర్‌

భారత్ ప్రయోగించిన ప్రతిష్టాకరమైన వ్యోమనౌక చంద్రయాన్‌-3 చంద్రునిపై కాలుమోపే చారిత్రక ఘట్టానికి చేరువైంది. దాదాపు చంద్రుడి ఉప‌రిత‌లానికి చేరుకున్న‌ది. ఈ నెల 23న సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్‌ ల్యాండర్‌ చంద్రుడిపై అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో చంద్రుడి దక్షిణ ధ్రువంపై సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు అనువైన ప్రదేశం కోసం విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషిస్తోంది. 
 
ఈ క్రమంలో భూమికి ఎప్పుడూ కనిపించని చంద్రుడి దక్షిణ ధ్రువం ఉండే ప్రాంతానికి సంబంధించిన కొన్ని చిత్రాలను ల్యాండర్‌ తన కెమెరాలో బంధించింది.  ఈ ఫొటోలను భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ట్విట్టర్‌ (ఎక్స్‌)లో పోస్టు చేసింది. విక్రమ్‌ ల్యాండర్‌కు అమర్చిన ల్యాండర్‌ హజార్డ్‌ డిటెక్షన్‌ అండ్‌ అవైడెన్స్‌ కెమెరా  చంద్రుడి అవతలివైపు ఫొటోలను తీసినట్లు తెలిపింది. 
జాబిల్లిపై విక్రమ్‌ సురక్షితంగా ల్యాండ్‌ అయ్యేందుకు ఈ కెమెరా సాయపడుతుందని పేర్కొంది. బండరాళ్లు, లోతైన కందకాలు లేని సురక్షితమైన ప్రాంతాన్ని గుర్తించేందుకు విక్రమ్‌ ల్యాండర్‌ అన్వేషిస్తున్నట్లు వెల్లడించింది. తొలుత ఈ నెల 23న సాయంత్రం 5.47 గంటలకు సాఫ్ట్‌ల్యాండింగ్‌ చేయాలని ఇస్రో నిర్ణయించింది. అయితే తాజాగా ఈ సమయంలో మార్పు చేశారు. 

17 నిమిషాలు ఆలస్యంగా సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్‌ను చంద్రుడిపై దించాలని నిర్ణయించిన్నట్లు ఇస్రో ట్విట్టర్‌ ద్వారా ఆదివారం వెల్లడించింది. మరోవైపు చంద్రయాన్‌-3కి పోటీగా రష్యా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమవడంతో ఇప్పుడు అందరి కళ్లూ చంద్రయాన్‌-3పైనే ఉన్నాయి. చారిత్రక ఘట్టం కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

ప్రయోగంలో కీలకమైన రెండో డీబూస్టింగ్‌ ప్రక్రియ సైతం విజయవంతమైంది. ఆదివారం ల్యాండర్‌ వేగాన్ని తగ్గించే విన్యాసాన్ని ఇస్రో చేపట్టింది. ఈ ప్రక్రియ అనంతరం ల్యాండర్‌ జాబిల్లికి మరింత చేరువైంది. ప్రస్తుతం ల్యాండర్‌ మాడ్యూల్‌ 25 x 134 కిలోమీటర్ల కక్ష్యలో పరిభ్రమిస్తున్నది. ఇదే కక్ష్య నుంచి ఈ నెల 23న సాఫ్ట్‌ ల్యాండింగ్‌ చేపట్టనున్నది.

ఇప్పటికే చంద్రునికి సంబంధించిన మూడు వీడియోలను ఇస్రో విడుదల చేసింది. వీటిలో ఒక వీడియోను విక్రమ్‌కి అమర్చిన ల్యాండర్‌ పొజీషన్‌ డిటెక్షన్‌ కెమెరా (ఎల్‌పిడిసి) ఆగస్ట్‌ 15న చిత్రీకరించినట్లు తెలిపింది. ఆగస్ట్‌ 17న లాండర్‌ మాడ్యూల్‌ విక్రమ్‌ ప్రొపల్షన్‌ మాడ్యూల్‌ నుండి విడిపోయిన అనంతరం లాండర్‌ ఇమేజర్‌ (ఎల్‌ఐ) కెమెరా -1 మరో వీడియోను బంధించినట్లు వెల్లడించింది. ఆగస్ట్‌ 5న చంద్రయాన్‌-3ని చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టిన వెంటనే మొదటి వీడియోని పంపినట్లు ఇస్రో ప్రకటించింది.

అంతరిక్ష పరిశోధనల్లో దేశం సాధించిన పురోగతిని భారతీయులందరూ వీక్షించేలా ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. జాబిల్లిపై ల్యాండర్‌ కాలు మోపే అద్భుత దృశ్యాన్ని అందరూ చూసేలా లైవ్‌ స్ట్రీమింగ్‌ నిర్వహించాలని నిర్ణయించింది.  సాఫ్ట్‌ ల్యాండింగ్‌కు సంబంధించి సాయంత్రం 5.27 గంటల నుంచి లైవ్‌ను ప్రారంభించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తున్నట్లు ఇస్రో వెల్లడించింది. ఇస్రో వెబ్‌సైట్‌, య్యూట్యూబ్‌ చానల్‌, ఫేస్‌బుక్‌ పేజీ, డీడీ నేషనల్‌ చానల్‌లో ఈ దృశ్యాలను వీక్షించవచ్చు. విద్యా సంస్థల్లో లైవ్‌స్ట్రీమింగ్‌ నిర్వహించాలని ఇస్రో పిలుపునిచ్చింది.

 కాగా,  చంద్ర‌యాన్‌-2కు చెందిన ఆర్బిటార్ ప్ర‌దాన్ ప్ర‌స్తుతం క‌క్ష్య‌లోనే తిరుగుతున్న విష‌యం తెలిసిందే.ఆ ఆర్బిటార్  విక్ర‌మ్‌కు స్వాగతం చెప్పింది. ఇస్రో త‌న ఎక్స్ సోష‌ల్ మీడియా అకౌంట్‌లో ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. `వెల్క‌మ్ బ‌డ్డీ’ అంటూ ఆ మెసేజ్‌లో పోస్టు చేశారు. చంద్ర‌యాన్‌-2 ఆర్బిటార్‌, చంద్ర‌యాన్‌-3 ల్యాండ‌ర్‌తో టూ వే క‌మ్యూనికేష‌న్ ఏర్పాటు చేసిన‌ట్లు ఇస్రో తెలిపింది.