ఓటర్ల జాబితాలో ఏపీలో భారీగా అవకతవకలు

ఆంధ్ర ప్రదేశ్ లో ఓటర్ల జాబితాలో వేలసంఖ్యలో భారీగా అవకతవకలు జరుగుతున్నాయని బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు, మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. సోమవారం ఓటరు అవగాహనపై బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో సామాన్యుల చేతిలో ఉన్న గొప్ప ఆయుధం ఓటు అని చెప్పుకొచ్చారు. 
 
ఓటర్ల జాబితాలో అవకతవకలు గతంలోనూ ఇప్పుడూ జరుగుతున్నాయని చెబుతూ తమకు వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు తాము కోరుకునే పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఓటు ప్రధాన ఆయుధమని, దానిని కూడా దుర్వినియోగం చేసేలా కొన్ని పార్టీలు వ్యవహరిస్తున్నాయని ఆమె విమర్శించారు.
సామాన్య ప్రజల చేతిలో పదునైన ఆయుధం ఓటని పురంధేశ్వరి చెప్పారు. అర్హులైన వారందరిని ఓటర్ల జాబితా నుంచి తొలగించడానికి పథకం ప్రకారం వ్యవహరిస్తున్నారని మాజీ కేంద్ర మంత్రి ఆరోపించారు. అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తమకు అనుకూలం అయిన వారిని మాత్రమే జాబితాలో ఉంచడం, అనుకూలంగా లేని వారిని తొలగించడం వంటి చేస్తున్నారని ఆమె మండిపడ్డారు.
ఓట్ల తొలగింపు అంశం రాష్ట్ర వ్యాప్తంగా వికృతరూపం సంతరించుకుందని చెబుతూ విశాఖలో ఓ నియోజక వర్గంలో 271 బూత్‌లు ఉంటే అక్కడ 2.61లక్షల ఓట్లు ఉన్నాయని ఆమె చెప్పారు. ఉన్న ఓట్లలో 70వేల ఓట్లలో అర్హులు కాని వారున్నారని తెలిపారు.  ఉరవకొండలో అర్హులైన ఓట్ల తొలగింపులో ఇద్దరు అధికారుల్ని తొలగించారని, జడ్పీ సీఈఓలుగా పనిచేసిన భాస్కర్‌ రెడ్డి, స్వరూపరాణిలపై ఈసీ చర్యలు తీసుకుందని పురందేశ్వరి గుర్తు చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇలా జరిగి ఉంటుందని పేర్కొంటూ జిల్లా స్థాయి, మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు ఓటర్ల జాబితాలు తనిఖీ చేయాలని భావిస్తున్నట్లు పురందేశ్వరి వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్ల జాబితాలపై ప్రత్యేకంగా తనిఖీలు నిర్వహిస్తామని ఆమె చెప్పారు. జిల్లా స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు ఫార్మ్‌ 6, ఫార్మ్ 7, ఫార్మ్ 8ల ద్వారా కొత్త వారిని చేర్చడం, లేని వారిని తొలగించడం, సవరణలు చేపట్టడం వంటి విషయాలపై కార్యక్రమాలను చేపడతామని ఆమె తెలిపారు. 

వాలంటీర్ల ద్వారా సమాచారాన్ని సేకరించి ఓటర్ల జాబితాల్లో అక్రమాలకు అధికార పార్టీ పాల్పడుతోందని పురందేశ్వరి ఆరోపించారు. ఓటర్ల జాబితా రూపకల్పనపై ఎలా ముందుకు వెళ‌్ళాలనే దానిపై చర్చిస్తున్నామని ఆమె పేర్కొన్నారు. ఇలాంటి వాటి విషయంలో బీజేపీ  కఠినంగా వ్యవహరిస్తుందని పురందేశ్వరి హెచ్చరించారు.

మరోవైపు విజయవాడలో నిర్వహించిన పార్టీ సమావేశానికి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్‌ హాజరు కావాల్సి ఉన్నా చివరి నిమిషంలో పర్యటన రద్దైంది. విమానం ఆలస్యం కావడంతో భేటీలో వర్చువల్‌గా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.

ఉరవకొండలో మరో అధికారి సస్పెన్షన్
 
ఇలా ఉండగా, ఉరవకొండ ఓట్ల తొలగింపు వ్యవహారంలో మరో ఉన్నతాధికారిపై సస్పెన్షన్‌ వేటుపడింది. అనంతపురంలో నాడు జడ్పీ సీఈఓగా ఉన్న శోభా స్వరూపా రాణిని సస్పెండ్‌ చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే జడ్పీ సీఈఓ భాస్కర్‌ రెడ్డి సస్పెన్షన్‌ అయ్యారు.  భాస్కర్‌ రెడ్డికి ముందు అదే స్థానంలో పనిచేసిన స్వరూపారాణి పైనా సస్పెన్షన్‌ వేటుపడింది.
గతంలో అనంత జడ్పీ సీఈఓగా స్వరూపా రాణి పని చేసిన సమయంలో ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్ల తొలగింపునకు బాధ్యురాలిని చేస్తూ సస్పెన్షన్‌ చేశారు. ప్రస్తుతం బాపట్ల జిల్లాలో ఈటీసీకు గెజిటెడ్‌ ఇన్‌స్ట్రక్టర్‌ గా స్వరూపా రాణి పనిచేస్తున్నారు.  2021లో అనంతపురం జడ్పీ సీఈఓగా పని చేసిన సమయంలో అక్రమంగా 1796 ఓట్ల తొలగింపుపై తాజాగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా ఆదేశాలను జారీ చేసింది.