115 మంది అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్

 
* రెండు చోట్ల నుండి కేసీఆర్ పోటీ
 
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలలకు ముందుగానే దాదాపుగా మొత్తం అభ్యర్థులను ప్రకటించి బిఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు చరిత్ర సృష్టించారు. మొత్తం 119 స్థానాలకు గాను 115 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించారు. కేవలం నాలుగు నియోజకవర్గాలకు మాత్రమే ఇంకా ప్రకటించాల్సి ఉంది. ఏడు చోట్ల తప్ప మిగతా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌ అభ్యర్థులకే ఛాన్స్‌ ఇచ్చినట్లు కేసీఆర్‌ ప్రకటించారు.
కాగా, కేసీఆర్ తాను ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్‌ తో పాటు కామారెడ్డి నుండి కూడా పోటీ చేయనున్నట్లు సీఎం చెప్పారు. మంచి ముహూర్తం ఉండటంతో జాబితా ప్రకటించినట్లు తెలిపారు.  కంటోన్మెంట్‌ సీటు సాయన్న కూతురు లాస్య నందితకు కేటాయించినట్లు వెల్లడించారు. కొన్ని కారణాలవల్ల ఏడుగురు సిట్టింగు అభ్యర్థులకు టికెట్‌ నిరాకరించినట్లు సీఎం చెప్పారు.
వైరా, ఆసిఫాబాద్‌, బోథ్‌, ఉప్పల్‌ స్థానాల్లో అభ్యర్థులను మార్చినట్లు సీఎం చెప్పారు.  ఎప్పటిలాగే సిద్దిపేట నుంచి హరీశ్ రావు, సిరిసిల్ల నుంచి కేటీఆర్ పోటీ చేయనున్నారు.  కొన్ని కారణాల వల్ల బోథ్, ఖానాపూర్, ఆసిఫాబాద్, వైరా, కోరుట్ల, ఉప్పల్, వేములవాడ స్థానాల్లో అభ్యర్థులను మార్చామని చెప్పారు. వివాదాస్పదంగా మారిన స్టేషన్ ఘన్ పూర్  సిట్టింగ్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య స్థానంలో మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరిని ఎంపిక చేశారు. 
నర్సాపూర్, జనగామ, నాంపల్లి, గోషామహల్ సీట్లు మాత్రమే పెండింగ్‌లో పెట్టారు. హుజూరాబాద్‌ స్థానంలో కౌశిక్‌రెడ్డి, వేములవాడలో చల్మెడ లక్ష్మీనరసింహారావులు పోటీ చేయనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు అభ్యర్థన మేరకు ఆ స్థానాని ఆయన కుమారుడు సంజయ్‌కి కేటాయించామని సీఎం వెల్లడించారు. 
 
వేములవాడలో చెన్నమనేని పౌరసత్వ వివాదం నడుస్తోందని, అందుకే ఆయనకు టికెట్ ఇవ్వలేకపోతున్నామని చెప్పారు. ఆయన చాలా మంచి వ్యక్తి అయినా సరే నిరాకరించటం తప్పటం లేదని పేర్కొన్నారు. దుబ్బాక నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తారని కేసీఆర్ ప్రకటించారు. ఉప్పల్ లో ఎమ్మెల్యే బేతి సుభాష్ స్థానంలో బండారు లక్ష్మారెడ్డి, వైరాలో ఎమ్మెల్యే రాములు నాయక్ స్థానంలో మదన్ లాల్, ఆసిఫాబాద్ లో ఎమ్మెల్యే ఆత్రం సక్కు స్థానంలో కోవా లక్ష్మి, ఖానాపూర్ లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖ నాయక్ స్థానంలో భూక్య జాన్సన్ రాథోడ్ నాయక్, బోథ్ లో ఎమ్మెల్యే రాథోడ్ బాపు రావు స్థానంలో అనిల్ జాదవ్ లకు అవకాశం ఇచ్చారు.
టికెట్ రానంత మాత్రాన హడావుడి పడి భవిష్యత్తు పాడు చేసుకోవద్దని.. పార్టీ మారకుండా అభ్యర్థులను గెలిపించుకోవాలని నేతలకు కేసీఆర్ సూచించారు. బిఆర్ఎస్ ప్రకటించిన అభ్యర్థులను మనస్పూర్తిగా స్వీకరించి, అందర్నీ గెలిపించాలని కెసిఆర్ విజ్ఞప్తి చేశారు. బిఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో 95 నుండి 105 సీట్లలో గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
 
అక్టోబర్ 16న వరంగల్ లో మేనిఫెస్టో విడుదల
 
కాగా, బిఆర్ఎస్ ఎన్నికల ప్రణాళిక `ప్రగతి’ని అక్టోబర్ 16న వరంగల్ లో 10 లక్షల మందితో జరిపే భారీ బహిరంగసభలో విడుదల చేయనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. అప్పటి నుండే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నట్లు తెలిపారు.  150 ఎకరాల స్థలంలో బహిరంగసభ నిర్వహణకు సన్నాహాలు ప్రారంభించినట్లు చెప్పారు.