పాక్ లో ఉగ్రదాడిలో 11 మంది కూలీల మృతి

పాకిస్థాన్‌లో ఉగ్రవాదుల దాడి జరిగింది. కూలీలతో వెళ్తున్న వాహనాన్ని బాంబులతో పేల్చివేశారు. ఈ సంఘటనలో 11 మంది కార్మికులు మరణించారు. పలువురు గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్‌కు సరిహద్దులో ఉన్న పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో ఈ సంఘటన జరిగింది. 

శనివారం అర్ధరాత్రి ఉత్తర వజీరిస్థాన్ గిరిజన జిల్లాలోని గుల్ మీర్ కోట్ సమీపంలో రోడ్డు పక్కన పేలుడు పదార్థాలను ఉగ్రవాదులు అమర్చారు. ఉత్తర వజీరిస్థాన్ లోని షావల్ ప్రాంతం నుంచి కార్మికులు వ్యాన్‌లో దక్షిణ వజీరిస్థాన్ ప్రాంతానికి వెళ్తుండగా 16 మంది  కూలీలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఆ పేలుడు పదార్థాలతో పేల్చివేశారు.

కాగా, ఈ దాడిలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరో ముగ్గురి ఆచూకీ తెలియలేదని పోలీస్‌ అధికారి తెలిపారు. ఈ  కూలీలంతా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనంలో పనిచేస్తున్నారని చెప్పారు.

మృతదేహాలతోపాటు గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించినట్లు వెల్లడించారు. పాకిస్థాన్‌ తాత్కాలిక ప్రధాని అన్వర్ ఉల్ హక్ కాకర్ ఈ దాడిని ఖండించారు. మరోవైపు ఈ సంఘటనకు ముందు శనివారం ఎగువ దక్షిణ వజీరిస్థాన్‌లోని మాకిన్‌ ప్రాంతంలో
బాంబు నిర్వీర్య స్క్వాడ్‌ వాహనంపై దుండగులు రాకెట్‌తో దాడి చేశారు. ఈ సంఘటనలో ఆ వాహనంలోని నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు.