రష్యా ప్రతిష్టాత్మకంగా చేపట్టిన లూనా-25 మిషన్ విఫలమైంది! ఇప్పటివరకు ఎవరూ వెళ్లని చంద్రుడి దక్షిణ ధ్రువంపై కాలుమోపేందుకు ప్రయత్నించిన రష్యా విఫలమైంది. భారత్ ప్రయోగించిన చంద్రయాన్ 3 కంటే చాలా ఆలస్యంగా రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్‌కాస్మోస్ లూనా -25 పేరుతో ఒక వ్యోమ నౌకను పంపించింది.
ఇది కూడా అచ్చం చంద్రయాన్ 3 ప్రయోగం లాగానే చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగి పరిశోధనలు చేయాలని భావించింది. అయితే ముందుగా నిర్ణయించిన ప్రకారం ఆగస్టు 21 వ తేదీన జాబిల్లి దక్షిణ ధ్రువంపై లూనా 25 దిగాల్సి ఉంది. అయితే చంద్రుడి కక్ష్యలో ప్రవేశించేవరకు విజయవంతంగా వెళ్లిన లూనా 25 అంతరిక్షనౌక చివరకు మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో చంద్రుడి ఉపరితలంపై క్రాష్ అయినట్లు రోస్‌కాస్మోస్ ప్రకటించింది.
ఆగస్టు 19న లూనా-25 స్పేస్‌క్రాఫ్ట్ నిర్దేశిత ఆర్బిట్‌లోకి వెళ్లాల్సి ఉంది. కానీ ఈ ప్రయత్నం విఫలమైంది. ఇది జరిగిన ఒక రోజు తర్వాత ఆటోమేటిక్ స్టేషన్‌లో అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, దీంతో వేగం తగ్గింపు విన్యాసం చేసేందుకు వీలు కాలేదని శనివారం తెలిపింది. అయితే లూనా-25 కూలిపోయిందని, చంద్రుడి దక్షిణ ధృవం వద్ద ఉపరితలాన్ని ఢీకొట్టిందని రోస్‌కాస్మోస్ ఆదివారం వెల్లడించింది.
“ఆగస్ట్ 19న స్పేస్‌క్రాఫ్ట్ నిర్దేశిత ఆర్బిట్‌లోకి వెళ్లేందుకు ఇంపల్స్ తీసుకుంది. ఆ తర్వాత రష్యా స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటల 57 నిమిషాలకు లూనా-25తో సంబంధాలు తెగిపోయాయి” అని ప్రకటించింది. “స్పేస్‌క్రాఫ్ట్‌ను గుర్తించేందుకు శని, ఆదివారాలు ప్రయత్నించాము. కానీ నియంత్రించలేని ఆర్బిట్‌లోకి అది ప్రవేశించడంతో, చంద్రుడిపై లూనా-25 కుప్పకూలింది,” అని రష్యా స్పేస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. ప్రాథమిక విశ్లేషణ ప్రకారం ఇంపల్స్‌లో డీవియేషన్ కారణంగానే లూనా-25 కుప్పకూలింది.
ఆ తర్వాత భూమితో సంబంధాలు తెగిపోయాయి. ఈ పూర్తి ఘటనను అధ్యయనం చేసేందుకు ఓ కమిటిని ఏర్పాటు చేశారు రష్యా అధికారులు.
దాదాపు 50 ఏళ్ల తర్వాత చంద్రుడిపై మిషన్ చేపట్టింది రష్యా. చివరిగా 1976లో లూనా-24ను లాంచ్ చేసింది. ఎన్నో ఆటంకాలను ఎదుర్కొని భారీ ఆశల మధ్య ఆగస్ట్ 10న నింగిలోకి ఎగిరింది లూనా-25. కానీ మిషన్ పూర్తవ్వకుండానే విఫలమైంది.
చంద్రయాన్-3 ప్రస్తుతం చంద్రుడిపై ల్యాండింగ్‌కు సిద్ధమవుతోంది. అయితే కొన్నేళ్ల క్రితం చేపట్టిన చంద్రయాన్-2 మిషన్ విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో చంద్రుడిపై క్రాష్ అయిపోయింది. చంద్రయాన్-3 లాంచ్ జరిగిన దాదాపు నెల రోజులకు లూనా-25 నింగిలోకి ఎగిరింది.
ఈ రెండు స్పేస్‌క్రాఫ్ట్‌లు దాదాపు ఒకే సమయంలో జాబిల్లిలోని దక్షిణ ధృవంలో అడుగుపెడతాయని శాస్త్రవేత్తలు తెలిపారు. కానీ ఈలోపే, లూనా-25 కుప్పకూలింది. చంద్రయాన్ 3 మాత్రం విజయవంతంగా ముందుకెళుతోంది. ఈ బుధవారం సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడి ఉపరితలంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెడుతుందని ఇస్రో అధికారికంగా ప్రకటించింది.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!
అంతరిక్షం నుంచి మహా కుంభ మేళా.. ఇస్రో ఫొటోలు