భూభాగం కోల్పోయామన్న రాహుల్ వాఖ్యలపై మండిపాటు

భారత దేశం తన భూభాగాన్ని కోల్పోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై భద్రతా రంగ నిపుణుడు, భారత సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్‌గా సేవలందించి, పదవీ విరమణ చేసిన సంజయ్ కులకర్ణి ఘాటుగా స్పందించారు. మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను జరుపుకోవడం కోసం ఆయన కుమారుడు రాహుల్ గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్నారు.

సంజయ్ కులకర్ణి ఆదివారం ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ, భారత్-చైనా మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకూడదని హితవు చెప్పారు. 1950 నుంచి దాదాపు 40,000 చదరపు కిలోమీటర్ల భూమిని భారత దేశం కోల్పోయిందని, దానిని చైనా ఆక్రమించుకుందని చెప్పారు.

 ఇకపై మరింత భూమిని కోల్పోకుండా చూసుకోవడానికే ప్రయత్నం జరుగుతోందని పేర్కొన్నారు. అయితే మనం భూమిని కోల్పోయామని చెప్పడం కేవలం మన అవగాహనకు సంబంధించినది మాత్రమేనని, ఇటువంటి ప్రకటనలు ఒకరిని మరొకరికి వ్యతిరేకంగా పేలవంగా చూపుతాయని చెప్పారు.

ప్రధానంగా రెండు ఘర్షణ ప్రాంతాలు – దెమ్‌చోక్, డెప్సాంగ్ – ఉన్నాయని, ఇక్కడ గస్తీని నియంత్రిస్తున్నారని, భారత్-చైనా మధ్య సైనిక చర్చలు జరుగుతున్నాయని కుల్కర్ణి చెప్పారు. మనం భూమిని కోల్పోయామని చెప్పడం సరైనది కాదన్నారు. చర్చలు జరుగుతున్నపుడు ఇటువంటి ప్రకటనలను ఎవరూ ఇవ్వకూడదని స్పష్టం చేశారు.

రాహుల్ తన తండ్రి రాజీవ్ 79వ జయంత్యుత్సవాల సందర్భంగా పాంగాంగ్ సో సరస్సు వద్ద ప్రార్థనల్లో పాల్గొన్నారు. అంతకుముందు ఆయన మీడియాతో మాట్లాడుతూ భారత దేశానికి చెందిన ఒక అంగుళం భూమినైనా చైనా ఆక్రమించుకోలేదని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్తున్నారని, అది నిజం కాదని మండిపడ్డారు. 

భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని స్థానికులు కూడా చెప్తున్నారని తెలిపారు. పశువులను మేపుకునే స్థలాలను చైనా సైన్యం ఆక్రమించుకుందని చెప్తున్నారని తెలిపారు. ఇది చాలా ఆందోళనకరమైన విషయమని చెబుతూ మన భూమిని చైనా లాక్కోవడం కచ్చితంగా ఆందోళన కలిగించే విషయమేనని చెప్పారు.

మరోవంక, రాహుల్ గాంధీ ఆరోపణలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా మాట్లాడుతూ, ‘‘హిందీ చీనీ భాయి భాయి’’ అని నినాదాలు చేసిన కాంగ్రెస్ ఆత్మావలోకనం చేసుకోవాలని ధ్వజమెత్తారు. 45 వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనాకు కాంగ్రెస్ అప్పగించిందని మండిపడ్డారు.

కాగా, రాహుల్‌గాంధీ లడఖ్‌లో పర్యటిస్తున్న ఫోటోలు, వార్తలు వైరల్ కావడంతో కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ట్విటర్ వేదికగా స్పందిస్తూ కొండ ప్రాంతమైన లడఖ్‌లో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అభివృద్ధి చేసి మంచి రోడ్లు వేసిందని తెలిపారు. అలాంటి రోడ్లపై బైక్ రైడ్ చేసి.. వాటిని దేశం మొత్తానికి చూపించేలా చేసిన రాహుల్ గాంధీకి ధన్యవాదాలు అంటూ కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు. 

దీనికి తోడు లడఖ్‌లో 2012 లో ఉన్న రోడ్లు, ప్రస్తుతం ఉన్న రహదారులకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసిన కిరణ్ రిజిజ గత కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రస్తుత నరేంద్ర మోదీ పాలనలో తేడా ఇదే అని పేర్కొన్నారు. రాళ్లు, మట్టి ఉండి వాహనాలు ప్రయాణించలేని పరిస్థితిని నుంచి రయ్ మంటూ దూసుకెళ్లే హైవేలు ఏర్పాటయ్యాయని వెల్లడించారు.

మోదీ హయాంలో లడఖ్‌లో నిర్మించిన రహదారులను ప్రమోట్ చేస్తున్నందుకు కశ్మీర్ లోయలోనూ టూరిజం అభివృద్ధి చెందుతోందని ప్రచారం చేస్తున్నందుకూ రాహుల్ గాంధీకి థాంక్స్ అని తెలిపారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఇప్పుడు భారతీయ జెండాను గర్వంగా ఎగరేయచ్చని పేర్కొన్నారు. 

మరోవైపు.. రాహుల్ బైక్‌ రైడ్‌పై మరో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి కూడా స్పందిస్తూ  రాహుల్ స్వయంగా వెళ్లి లడఖ్ టూరిజాన్ని ప్రమోట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత కశ్మీర్‌లో జరుగుతున్న అభివృద్ధిని స్వయంగా రాహుల్ గాంధీ ప్రమోట్ చేస్తుండటం సంతోషమని.. రోడ్‌ ట్రిప్‌ ఫొటోలు, వీడియోలు చూసి చాలా సంతోషించినట్లు ప్రహ్లాద్ జోషి తెలిపారు.