పరిష్కారాలను కనుగొనడంలో భారత్ ఆదర్శ ప్రయోగశాల

పరిష్కారాలను కనుగొనడంలో భారత్ ఆదర్శ ప్రయోగశాల

పరిష్కారాలను కనుగొనడంలో భారత్ ఆదర్శ ప్రయోగశాల అని. ఇక్కడ కనుగొన్న పరిష్కారాలను ప్రపంచంలో ఎక్కడైనా అమలు చేయవచ్చని ప్రధాని  నరేంద్ర మోదీ తెలిపారు. జి20 డిజిటల్ ఎకానమీ వర్కింగ్ గ్రూప్ మంత్రులతో శనివారం బెంగళూరు వేదికగా జరిగిన సమావేశంలో ప్రధాని వర్చ్యువల్ గా పాల్గొని ప్రసంగించారు. 

భారత్ డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రపంచ సవాళ్లకు సురక్షితమైన, సమగ్ర పరిష్కారాన్ని అందిస్తుందని ప్రధాని చెప్పారు. భారత్ వైవిధ్యభరిత దేశమని, ఎన్నోభాషలు, వందలాది మాండలికాలు ఉన్నాయని, ఇది ప్రపంచం లోని అన్ని మతాలకు సాంస్కృతిక పద్ధతులకు నిలయంగా మారిందని పేర్కొన్నారు.

పురాతన సంప్రదాయాల నుంచి నేటి సాంకేతికత వరకు భారత్ ఎంతో ప్రత్యేకమైనదని చెబుతూ ఇక్కడ కనుగొన్న పరిష్కారాలను ఎక్కడైనా కచ్చింతంగా అమలు చేయవచ్చని ప్రధాని స్పష్టం చేశారు. ‘త్వరలో ఏఐ పవర్డ్ లాంగ్వేజ్ ట్రాన్స్‌లేషన్ ప్లాట్‌ఫాం ‘భాషిణి’ ని రూపొందించనున్నాం. దేశం లోని అన్ని భాషలను అనువదించడానికి ఉపయోగపడుతుంది’ అని ప్రధాని వెల్లడించారు. 

డిజిటల్ ఎకానమీ రంగంలో భారత ప్రభుత్వం చేసిన ప్రయోగాలను ప్రధాని వివరించారు. తన అనుభవాలను ప్రపంచంతో పంచుకునేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపారు. ఇదిలా ఉండగా దేశం లోని వివిధ బ్యాంకుల్లో జన్‌ధన్ ఖాతాలు 50 కోట్లకు పైగా ఉన్నాయని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన విషయం తెలిసిందే. 

దీనిపై ప్రధాని స్పందిస్తూ ‘‘ఇది ఒక అద్భుతమైన మైలురాయి. వీటిలో  సగానికి  పైగా ఖాతాలు నారీశక్తివే కావడం ఆనందదాయకం. 67% ఖాతాలు గ్రామీణ, సెమీ-అర్బన్  ప్రాంతాల్లో తెరిపించడమే కాదు, మన దేశంలో ప్రతీ మారుమూల ప్రాంతాలకు ఫైనాన్షియల్  ఇంక్లూజన్  ప్రయోజనాలు అందడానికి మేం హామీ ఇస్తున్నాం’’ అని ట్వీట్  చేశారు.