ఆలయంలోకి ప్రవేశించకుండా దళితులకు అడ్డు

కఠినమైన చట్టాలు అమలులోకి వచ్చినా, సాధువులు, సామజిక కార్యకర్తలు ఎంతగా కృషి చేస్తున్నా దళితుల పట్ల వివక్ష కొనసాగుతుంది. ఇప్పటికీ కొన్ని చోట్ల దళితుల ఆలయ ప్రవేశాలను అడ్డుకుంటున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ఉల్లంఘిస్తూ వివక్ష చూపిస్తున్నారు.
తిరుపతి జిల్లాలో ఇలాంటి ఘటన చోటుచేసుకుంది. 
 
దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని, అగ్రకులస్తులు గుడికి తాళం వేశాడు. పుత్తూరు మండలం గొల్లపల్లి గ్రామంలోని పోలాక్షమ్మ జాతర సందర్భంగా పొంగళ్లు సమర్పించేందుకు దళితులు ఆలయానికి వచ్చారు. అయితే వారిని ఆలయంలోకి వెళ్లనివ్వకుండా అగ్రకులస్తులు అడ్డుకున్నారు. ఆ ఆలయ పూజారి దళితులకు గుడిలోకి ప్రవేశం లేదని ఆలయానికి తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
దీంతో దళితులు ఆలయం ముందు నిరసన చేశారు. ఎంతసేపటికీ తాళం తీయకపోవడంతో పోలాక్షమ్మ అమ్మవారికి బయటే పొంగళ్లు పెట్టి, మొక్కులు చెల్లించుకుని వెళ్లిపోయారు.  ఈ ఘటన తెలుసుకున్న దళితపోరాట హక్కుల సమితి తీవ్రఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ గ్రామంలో దళితులపై వివక్షపై పోరాటం చేస్తున్నామని, గతంలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని ఫలితం లేకపోయిందని తెలిపారు.
ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తే తహసీల్దార్‌ను పంపి దళితులకు ప్రవేశం కల్పిస్తామని హామీ ఇచ్చారని, అయితే, ఆ తర్వాత అధికారులు స్పందించలేదని వాపోయారు.