చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టం పూర్తి

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టం పూర్తయింది. రెండో, చివరి డీబూస్టింగ్‌ను ల్యాండర్‌ వేగం తగ్గింపు) విజయవంతంగా పూర్తిచేసింది. దీంతో చివరి లూనార్‌ కక్ష్యను పూర్తిచేసుని చంద్రుడికి మరింత చేరువైంది.  ప్రస్తుతం విక్రమ్‌ ల్యాండర్‌ అత్యల్పంగా 25 కిలోమీటర్లు, అత్యధికంగా 134 కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలో పరిభ్రమిస్తున్నది.
ఇక మిగిలింది చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై దిగడమే మిగిలి ఉంది. అన్నీ సవ్యంగా జరిగితే ఈ కక్ష్య నుంచే ఈ నెల 23న సాఫ్ట్‌ ల్యాండింగ్‌  నిర్వహించనున్నారు.  రెండో, చివరి డీబూస్టింగ్‌ ఆపరేషన్‌తో ల్యాండర్‌ మాడ్యూల్‌ 25 కిలోమీటర్లు X 134 కి.మీ. కక్ష్యలోకి చేరిందని సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ట్విట్టర్‌) ద్వారా ఇస్రో వెల్లడించింది.
మాడ్యూల్‌ను అంతర్గతంగా తనిఖీ చేయాల్సి ఉందని, ఎంచుకున్న ల్యాండింగ్‌ సైట్‌లో సూర్యోదయం కోసం వేచిచూస్తున్నామని పేర్కొంది.  చంద్రుడిపై అడుగుపెట్టే ప్రక్రియ ఆగస్టు 23న సాయంత్రం 5.45 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపింది. మొదటి డీబూస్టింగ్‌ను గత శుక్రవారం నిర్వహించిన విషయం తెలిసిందే. అన్నీ అనుకున్నట్లు సాగి చంద్రుడి ఉపరితలంపై విక్రమ్‌ ల్యాండర్‌ కాలు మోపితే భారత్‌ చరిత్ర సృష్టించనున్నది. 
ఇక చంద్రుడిపై సాఫ్ట్​ ల్యాండింగ్​ తర్వాత.. విక్రమ్​ ల్యాండర్​ నుంచి ప్రగ్యాన్​ రోవర్​ బయటకి వస్తుంది. ఇది 14 రోజుల పాటు చంద్రుడి ఉపరితలంపై ఉంటుంది. ఉపరితలంతో పాటు నీటి జాడలను కనుగొనే విధంగా పరిశోధనలు చేస్తుంది.  ఇప్పటివరకు ప్రపంచానికి తెలియని అనేక రహస్యాలను ఇది బయటపెట్టనున్నది. అయితే ఈ పరిశోధనల్లో ముఖ్య పాత్ర పోషించేది మాత్రం ప్రజ్ఞాన్‌ రోవర్.
ప్రజ్ఞాన్‌ అంటే సంస్కృతంలో విజ్ఞానం అని అర్థం. స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు. ఆరు చక్రాలతో జాబిల్లిపై పరుగులు పెట్టే దీని బరువు 26 కిలోలే.చంద్రుడి ఉపరితలంపై సేకరించే సమాచారాన్ని ఇది ల్యాండర్‌ విక్రమ్‌ సాయంతో భూమికి చేరవేస్తుంది. తనతో పాటు అనేక పరికరాలు, సెన్సార్లను ఇది తీసుకెళ్తున్నది. 

ఆల్ఫా పార్టికల్‌ ఎక్స్‌-రే స్పెక్ట్రోమీటర్‌ (ఏపీఎక్స్‌ఎస్‌), లేజర్‌ ప్రేరిత బ్రేక్‌డౌన్‌ స్పెక్ట్రోస్కోప్‌ (ఎల్‌ఐబీఎస్‌) సహా ప్రయోగాలు జరిపే పరికరాలు ఇందులో ఉంటాయి. ఖనిజాలు, పగలు- రాత్రి చక్రం, అణువులు, మట్టి, నీటి జాడ, సన్నని ఉపరితల వాతావరణం తదితర అంశాలపై రోవర్‌ దృష్టి సారిస్తుంది.