హిమాచల్ జలప్రళయంతో రూ.10వేల కోట్ల నష్టం

ఉత్తర భారతదేశంలోని హిమాచల్‌ ప్రదేశ్‌  రాష్ట్రాన్ని భారీ వర్షాలు  అతలాకుతలం చేస్తున్నాయి. జులై నెలలో సంభవించిన భారీ వరద ఘటనను మరవకముందే మరోసారి ఆ రాష్ట్రాన్ని వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షంతో కొండ ప్రాంత ప్రజలు అల్లాడిపోతున్నారు.  ఏకధాటిగా కురుస్తున్న భీకర వానతో ఆ రాష్ట్రం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.
ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ విపత్తు కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా రూ.10వేల కోట్ల మేర నష్టం వాటిల్లినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖ్విందర్‌ సింగ్‌ సుక్కు తెలిపారు.  వర్షం కారణంగా అన్ని విధాలా పూర్తిగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని పునర్నిర్మించేందుకు ఏడాది సమయం పడుతుందని ఆయన వెల్లడించారు. 
గత వారం రోజులుగా హిమాచల్‌లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.  పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. రాష్ట్ర రాజధాని సిమ్లాలోని సమ్మర్‌ హిల్‌ ప్రాంతంలో సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడినఘటనలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
మరోవైపు రుతుపవనాలు ప్రారంభమైన 55 రోజుల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 113 కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు.  దీంతో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కి రూ.2,491 కోట్ల మేర నష్టం వాటిల్లింది. అదేవిధంగా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.1,000 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు సిమ్లాలోని సమ్మర్ హిల్‌ వద్ద ఉన్న సిమ్లా-కల్కా రైల్వే లైన్‌ డ్యామేజ్‌ అయ్యింది. 
 
క్లౌడ్‌బస్ట్‌ వల్ల భారీ వరద రావడంతో రైల్వే ట్రాక్‌ కింద ఉన్న మట్టి ఊడ్చుకుపోయింది. దీంతో ఆ రైల్వే ట్రాక్‌ గాలికి వేలాడుతూ ఉంది. ఈ జలప్రళయంతో రాష్ట్ర టూరిజం పడిపోయింది. సాధారణంగా కొండ ప్రాంతాన్ని సందర్శించేందుకు ఏటా పర్యాటకులు పోటెత్తేవారు.  ఈ వర్ష ప్రభావంతో పర్యాటకుల తాకిడి భారీగా తగ్గింది. దీంతో ఆ రాష్ట్ర ఆదాయానికి భారీగా గండిపడింది.
ముఖ్యంగా స్థానికంగా ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు గతంలో రోజుకు రూ.2వేలు సంపాదించేవారు. ఇప్పుడు రోజుకు రూ.200 రావడం కూడా కష్టంగా మారింది.  సాధారణంగా 50 నుంచి 60 శాతంగా ఉన్న హోటల్‌ ఆక్యుపెన్సీ ప్రస్తుతం 5 శాతానికి పడిపోయిందంటే ఆ రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక ఈ సీజన్‌లో వర్షాలు, వరదలు సంభవించిన ఘటనల్లో సుమారు 300 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.