2000 మంది మణిపూర్ ఉద్యోగులు సురక్షిత ప్రాంతాలకు బదిలీ

మణిపూర్‌ లో సుమారు 2,000 మంది ప్రభుత్వ ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. వీరిలో పోలీసులు కూడా ఉన్నట్లు తెలిపింది. ఈ నెల ప్రారంభంలో మణిపూర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదకలో ఈ విషయాన్ని తెలిపింది. గత నాలుగు నెలలుగా మణిపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయస్థానాల్లో పనిచేసే సిబ్బంది మధ్య కూడా తీవ్రమైన అంతరాలు తలెత్తాయి. 

ఐదు పర్వత ప్రాంత జిల్లాలైన చురచంద్‌పూర్‌, కాంగ్‌పోక్సీ, చందేల్‌, తాంగ్నౌపాల్‌, మరియు ఫర్జాల్‌లకు (కుకీ గిరిజనులకు చెందిన ) ప్రత్యేకంగా ఓ చీఫ్‌ సెక్రటరీ, డిజిపిని ఏర్పాటు చేయాలని ఇటీవల రాష్ట్రానికి చెందిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రధానికి లేఖ రాశారు. వీరిలో బిజెపి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మే 3న మణిపూర్‌లో కుకీ, మొయితీల కమ్యూనిటీల మధ్య హింస చెలరేగినప్పటి నుండి రాష్ట్రంలో ప్రభుత్వ కార్యాలయాలు, న్యాయ వ్యవస్థ పనితీరులో తీవ్ర విభజన ఏర్పడింది.

పర్వత ప్రాంతాలపై కుకీ కమ్యూనిటీ ఆధిపత్యం ఉండగా, లోయలో మొయితీల ఆధిపత్యం అధికంగా ఉంది.  దీంతో ఇరువర్గాలకు చెందిన అధికారులు ఇతరుల అధిపత్యం ఉన్న జిల్లాలో తమ విధులను నిర్వర్తించలేకపోతున్నారు. ఇంఫాల్‌ లోయ తమకు ఏమాత్రం సురక్షితం కాదని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరులో కీలకమైన హైకోర్టు, సచివాలయం, పోలీసు ప్రధాన కార్యాలయం ఇంఫాల్‌లోనే ఉన్నాయి. 

ఈ నేపథ్యంలో తమకు ప్రత్యేక కార్యాలయాలు అవసరమని కుకీ-జో ప్రజా ప్రతినిధులు చెబుతున్నారు. అప్పుడే తమ వర్గాలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు సమస్యలను ఎదుర్కోవడం తగ్గుతుందని పేర్కొంటున్నారు.  ఐఎఎస్‌ అధికారులు, డ్రైవర్లు, ప్యూన్లు, సెక్యూరిటీ గార్డులు, పాఠశాల ఉపాధ్యాయులతో సహా ప్రభుత్వ ఉద్యోగులను ఎలాంటి బెదిరింపులు లేని జిల్లాలకు బదిలీ చేశారని ఆగస్ట్‌ 1న మణిపూర్‌ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టేటస్‌ రిపోర్టును సమర్పించింది. 

మణిపూర్‌ హైకోర్టులో 42 మంది ఉద్యోగులను బదిలీ చేయగా, మణిపూర్‌ ఫైనాన్స్‌ సర్వీస్‌కు చెందిన 25 మంది అధికారులు, 389 మంది పాఠశాల ఉపాధ్యాయులు మరియు 28 మంది ఐఎఎస్‌, ఎంసిఎస్‌ అధికారులను భద్రతా కారణాల దృష్ట్యా బదిలీ చేసినట్లు తెలిపింది.

761 మంది రాష్ట్ర పోలీసు సిబ్బంది తమ విధులకు గైర్హాజరయ్యారని నివేదిక పేర్కొంది. జూన్‌ 19 వరకు, 687 మంది సిబ్బంది తిరిగి విధులకు హాజరయ్యారని నివేదించారు. అయితే 74 మంది ఇప్పటికీ గైర్హాజరయ్యారు. మణిపూర్‌ రైఫిల్స్‌, ఇండియన్‌ రిజర్వ్‌ బెటాలియన్‌ (ఐఆర్‌బి)కి చెందిన 1,092 మంది సిబ్బంది కూడా విధులను విడిచిపెట్టినట్లు నివేదిక పేర్కొంది.

మణిపూర్‌లో మళ్లీ హింస.. ముగ్గురి కాల్చివేత

మరోవంక, మణిపూర్‌లో నాగాల ప్రాబల్యం అధికంగా ఉన్న ఉఖ్రుల్ జిల్లాలోని ఒక గ్రామంలో శుక్రవారం ఉదయం జరిగిన తాజా ఘర్షణల్లో ముగ్గురు వ్యక్తులు మరణించారు. ఇప్పటివరకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా ఉన్న ఈ ప్రాంతంలో హింసాకాండ చెలరేగడం ఇదే మొదటిసారి. ఉఖ్రుల్ పోలీసు స్టేషన్ పరిధిలోని తోవలై కుకీ గ్రామంలో తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ఘర్షణ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

గ్రామాన్ని కాపలా కాసేందుకు నియమించుకున్న ముగ్గురు వ్యక్తులు ఈ ఘర్షణలో మరణించినట్లు ఉఖ్రుల్ ఎస్‌పి నింగ్‌షెమ్ వాషుమ్ తెలిపారు.  రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న హింసాకాండకు సంబంధించిందే ఈ ఘటన కూడానని ఆయన చెప్పారు. గ్రామంలోకి చొరబడిన దుండగులు గ్రామంలో పహరా కాస్తున్న ముగ్గురు వ్యక్తులను కాల్చిచంపారని ఆయన చెప్పారు. ప్రస్తుతం అక్కడకు సైన్యం, పోలీసు సిబ్బంది చేరుకున్నారని ఆయన తెలిపారు. 

ఇది చాలా మారుమూల గ్రామమని, సమీప సెక్యూరిటీ పోస్టు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆయన వివరించారు. అందుకే భద్రతా సిబ్బంది ఆ గ్రామంలో ఆ సమయంలో లేరని ఆయన తెలిపారు. ఈ అల్లర్లు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో సుమారు 180 మందికి పైగా మరణించారు. అనేక మంది కనిపించకుండా పోయారు.