ఉపాధి హామీ అమలుపై డ్రోన్లతో పర్యవేక్షణ

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) అమలులో లొసుగులను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు పని ప్రదేశాల్లో కార్మికులపై డ్రోన్లతో నిఘా ఉంచాలని భావిస్తోంది. ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకున్నది. ఉపాధి హామీ పని నాణ్యతను పెంచటానికి, అక్రమాలను కట్టడి వేసే చర్యలో భాగంగానే వీటిని ఉపయోగించనున్నల్టు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తున్నది. 

గ్రామీణ మంత్రిత్వ శాఖ ఇటీవల జారీ చేసిన ప్రామాణిక ఆపరేటింగ్‌ విధానం (ఎస్‌ఒపి) ప్రకారం డ్రోన్‌లు నాలుగు రకాల పర్యవేక్షణ కోసం ఉపయోగించబడతాయి. అవి, కొనసాగుతున్న పనులను సర్వే చేయడం, పూర్తయిన పనులను తనిఖీ చేయడం, ఇంపాక్ట్‌ అసెస్‌మెంట్‌, ఫిర్యాదుల విషయంలో ప్రత్యేక తనిఖీ. ”ఉపాధి పనులలో అవినీతి గురించి అనేక ఫిర్యాదులు మాకు క్రమం తప్పకుండా అందుతున్నాయి.

రియల్‌ టైమ్‌ మానిటరింగ్‌, సాక్ష్యాలను సేకరించడం కోసం డ్రోన్‌లు ప్రత్యేకంగా సహాయపడతాయి” అని డ్రోన్ల వినియోగంపై సంబంధిత అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది మే 2022 నుంచి కేంద్రం ప్రత్యేకంగా అభివృద్ధి చేసిన మొబైల్‌ ఆధారిత అప్లికేషన్‌ని ఉపయోగించి అన్ని వర్క్‌సైట్‌ల హాజరును ఇప్పటికే తప్పనిసరిగా చేసింది.

”సమర్థవంతమైన పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారం కోసం, వర్చువల్‌గా పనుల ధృవీకరణ కోసం అంబుడ్స్‌పర్సన్‌ డ్రోన్‌ టెక్నాలజీ సౌకర్యాలను ఉపయోగించవచ్చని మంత్రిత్వశాఖ నిర్ణయించింది” అని ఎస్‌ఒపి పేర్కొన్నది.  అంబుడ్స్‌పర్సన్‌లకు అవసరమైన విధంగా సౌకర్యాన్ని కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. 

అయితే, ఈ డ్రోన్‌లను మోహరించడానికి కేంద్రం రాష్ట్రాలకు ఎటువంటి అదనపు నిధులను అందించడం లేదు. మార్గదర్శకాల ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వాలు అడ్మినిస్ట్రేటివ్‌ హెడ్‌ నుంచి అవసరమైన నిధులను తీసుకోవలసి ఉంటుంది. ఇది రాష్ట్ర ఉపాధి బడ్జెట్‌లో దాదాపు 10 శాతం కావటం గమనార్హం. డ్రోన్‌లను కొనుగోలు చేయడం కంటే, ఈ ప్రయోజనం కోసం డ్రోన్‌లలో ప్రత్యేకత కలిగిన ఏజెన్సీలను నియమించుకోవాలని కేంద్రం  రాష్ట్రాలను ఆదేశించింది.

డేటా విశ్లేషణ, రిపోర్టింగ్‌ ప్రయోజనాల కోసం డ్రోన్‌ల నుంచి సేకరించిన వీడియోలు, ఫోటోలను నిల్వ చేయడానికి కేంద్రీకృ డ్యాష్‌బోర్డ్‌ను రూపొందించాలని మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది.