
రాష్ట్ర ప్రభుత్వంలో టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లు సహా అన్ని బిల్లులపై తెలంగాణ గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ న్యాయ సలహా కోరారు. ఈ మేరకు బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్‌భవన్ ఓ ప్రకటనలో తెలిపింది. గతంలో వెనక్కి పంపిన బిల్లులపై చేసిన సిఫార్సుల గురించి కూడా గవర్నర్ అడిగారు.
కొద్ది నెలలుగా ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య తిరుగుతున్న నాలుగు బిల్లులను కూడా మరోసారి న్యాయశాఖ పరిశీలనకు పంపారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన బిల్లుల ఆమోదం విషయంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రతీ బిల్లునూ క్షుణ్ణంగా పరిశీలించి సందేహాలు నివృత్తి చేసుకుంటున్నారు. ఆర్టీసీ కార్మికుల భవిష్యత్తు, విలువైన ఆర్టీసీ ఆస్తులకు సంబంధించిన అంశం కావడంతో ఈ బిల్లు విషయంలో గవర్నర్ పట్టుదలగా ఉన్నట్లు తెలుస్తున్నది.
ప్రభుత్వం సంతృప్తికరమైన సమాచారం ఇచ్చే వరకు బిల్లులు పెండింగ్‌లో ఉంచుకునే విషయంలో రాజ్యాంగం కల్పించిన హక్కుల్ని పూర్తిగా వినియోగించుకుంటున్నారు. అదే సమయంలో తాను లేవనెత్తిన సందేహాలన్నీ ప్రభుత్వం విధిగా శాసనసభ, శాసనమండలి సభ్యుల దృష్టికి తీసుకెళ్లిందా? లేదా? అనే అంశాన్ని కూడా రాజ్యాంగంలోని ఆర్టికల్ 175(2) ద్వారా తనకు లభించిన అధికారాన్ని ఉపయోగించి, అసెంబ్లీ స్పీకర్, కౌన్సిల్ ఛైర్మన్‌లను అడిగి తెలుసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే ఇటీవలి అసెంబ్లీ సమావేశాల్లో సభ ఆమోదం తెలిపి తన వద్దకు పంపిన టీఎస్ ఆర్టీసీ ఉద్యోగుల విలీనం బిల్లుపై కూడా తాజాగా గవర్నర్ న్యాయ సలహాను కోరారు. గవర్నర్ గతంలో వెనక్కి పంపినపుడు ఆ 4 బిల్లులపై చేసిన సిఫార్సులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే అంశం గురించి కూడా గవర్నర్ అడిగారు.
కాగా, దురుద్దేశంతో చేస్తున్న అసత్యాలు, నిరాధార ప్రచారంతో ఆందోళనకు గురికావద్దని ప్రజలు, ప్రత్యేకించి ఆర్టీసీ ఉద్యోగులకు గవర్నర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వ బిజినెస్ రూల్స్, సచివాలయ నిబంధనలకు లోబడి బిల్లులను న్యాయశాఖ కార్యదర్శికి పంపినట్లు రాజ్‌భవన్ పేర్కొంది.
ఉద్యోగుల శ్రేయస్సు, కార్పొరేషన్ బాగు కోరి కొన్ని సిఫార్సులతో ఇటీవల శాసనసభ సమావేశాల్లో ఆర్టీసీ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ అనుమతించినట్లు రాజ్‌భవన్ వెల్లడించింది. ఆర్టీసీ బిల్లును గవర్నర్ ఆపినట్లు, రాష్ట్రపతి ఆమోదానికి పంపాలని నిర్ణయించినట్లు ఇతరత్రా వార్తలు వస్తున్న తరుణంలో మీడియాకు ప్రకటన విడుదల చేస్తున్నట్లు వివరించింది.
More Stories
పాలమూరు- రంగారెడ్డికి జాతీయ హోదా ఇవ్వలేం
12 నుండి 15 వరకు మినీ మేడారం జాతర
ఎస్సి వర్గీకరణ రిజర్వేషన్ల వాటాల్లో మాదిగలకు అన్యాయం