
నిర్మల్ లో మాత్రమే కాదు.. హైదరాబాద్ లోని భూములు దోచుకుంటున్నారని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. హైదరాబాద్ చుట్టుపక్కల భూములపై కేసీఆర్ కన్నేశారని ధ్వజమెత్తారు. నిర్మల్ పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ నూతన మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని, జీఓ 220ని క్యాన్సిల్ చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేస్తున్న ఆమరణ దీక్ష కార్యక్రమానికి ఈటల రాజేందర్ హాజరై మద్దతు ప్రకటించారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కేసీఆర్ వచ్చాక కొత్తరూపం ఎత్తారని, భూములు అమ్ముకొని బ్రోకర్ గా మారారని ప్రజలు అనుకుంటున్నారని ఆరోపించారు. జోన్ కన్వర్ట్ చెయ్యడం, అసైన్డ్ భూములు లాక్కోవడం, పరిశ్రమల పేరుతో భూములు సేకరించడం పేరుతో కేసీఆర్ భూములు పేదవారి చేతిలో లేకుండా చేస్తున్నారని ఆయన విమర్శించారు.
అభివృద్ధి, మాస్టర్ ప్లాన్ , ధరణి పేరుతో భూములు లూటీ చేస్తున్నారని ఆరోపించారు. పాత ఏరియాకే ఇండస్ట్రీలు రానప్పుడు కొత్త మాస్టర్ ప్లాన్స్ ఎందుకని ప్రశ్నించారు. గ్రీన్ బెల్ట్ కింద ఉన్న భూములను 220 జీవో తెచ్చి రైతుల కళ్లల్లో మట్టి కొడుతున్నారని మండిపడ్డారు. మంచి ధర పలికే భూములు ఎవరు కొనలేని పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
రైతుల కడుపుకొట్టే అధికారం ప్రభుత్వానికి ఎవరి ఇచ్చారని మాజీ మంత్రి ప్రశ్నించారు. అయితే, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. అభివృద్ధి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం, రైతుల భూములు తక్కువ ధరకు తీసుకునే కుట్ర జరుగుతోందని విమర్శించారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తన సొంత గ్రామ భూములను రెసిడెన్షియల్ జోన్ గా ప్రకటించడం న్యాయమా? అని నిలదీశారు.గతంలో ఆందోళనలు చేస్తే వెనక్కి తగ్గి మళ్ళీ మాస్టర్ ప్లాన్ తెరపైకి తీసుకరావడం పెద్ద కుట్ర అని రాజేందర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఉన్నది ప్రజలకు న్యాయం చేయడానికి కానీ, నేతలు లాభ పడటానికి కాదని స్పష్టం చేయసారు. పోలీసులు విపక్షాలను ఇబ్బంది పెడుతున్న తీరు బాధాకరమని చెప్పారు. ప్రతిపక్షాలను ప్రజల పక్షంలో ఉండనీయకుండా కేసీఆర్ చక్రవర్తిలా వ్యవహరిస్తున్నాడని విమర్శించారు. ఇది ఇలా ఉంటే నిర్మల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని కోరుతూ బిజెపి శుక్రవారం నిర్మల్ బంద్ కు పిలుపు ఇచ్చింది.
More Stories
బిజెపిపై విషం కక్కడమే వారి అజెండా!
యూట్యూబర్ సన్నీ యాదవ్ కు పోలీసులు లుక్ఔట్ నోలీసులు
బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన హైదరాబాద్ మెట్రో!