హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటివరకు 60 మంది మరణించినట్లు అధికారులు తెలిపారు. సిమ్లాలోని సమ్మర్ హిల్స్ ప్రాంతంలో బుధవారం కూడా కొండచరియలు విరిగిపడ్డాయి. ఇప్పటికే 21 మృతదేహాలను వెలికి తీసినట్లు అధికారులు తెలిపారు.
ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు ఆర్మీ, స్థానిక పోలీసులు సహాయక చర్యలు చేపడుతున్నారు. రానున్న రెండు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండి) వెల్లడించింది. ఇప్పటికే వరదలు ముంచెత్తడంతో కాంగ్రాలోని పాంగ్ డ్యామ్ సమీపంలోని లోతట్టు ప్రాంతాల నుండి సుమారు 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల ధాటికి డ్యామ్‌లో నీటి మట్టం పెరుగుతోందని అధికారులు తెలిపారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ప్రజలను తరలిస్తున్నామని చెప్పారు. బుధవారం కూడా విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. రాష్ట్రంలో వర్షాలపై ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ మాట్లాడుతూ గత మూడు రోజుల్లో సాధారణ వర్షపాతం కన్నా 157 శాతం అధికంగా వానలు కురిశాయన్నారు. రాష్ట్రంలో మొత్తం 1200 రహదారులు దెబ్బతినగా వాటిల్లో 400 రోడ్లను పునరుద్ధరించామని తెలిపారు.
ఈ సారి రాష్ట్రంలో మొత్తం 170 కుంభవృష్టి, కొండచరియలు విరిగిపడిన ఘటనలు నమోదయ్యాయి. దాదాపు 9,600 ఇళ్లు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా సిమ్లా, సోలన్, మండీ, హమీర్‌పుర్, కాంగ్రా జిల్లాల్లో నష్టం అధికంగా ఉంది. ఉత్తరాఖండ్‌లోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. చమోలీ జిల్లా జోషిమఠ్ సమీపంలోని హెలాంగ్‌లో మంగళవారం సాయంత్రం ఓ భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ఐదుగురిని శిథిలాల నుండి బయటకు తీసినట్లు రాష్ట్రవిపత్తు ప్రతిస్పందన దళం (ఆర్‌ఎస్‌ఎఫ్) తెలిపింది.
రుద్రప్రయాగ్‌లోని బంటోలిలో కాలినడక వంతెన కూలిపోవడంతో రుద్రప్రయాగ్‌కు వెళుతున్న సుమారు 200 మంది పర్యాటకులు చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
మరోసారి ప్రమాద స్థాయి దాటిన యమునా
ఢిల్లీలో యమునా నది నీటి ప్రవాహం మరోసారి ప్రమాద స్థాయిని దాటింది. గత రెండు రోజులుగా ఢిల్లీకి ఎగువన ఉన్న హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు యమునా నదికి వరద పోటెత్తుతోంది. దీంతో 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. కేంద్ర జల సంఘం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం 204.50 మీటర్ల ప్రమాద స్థాయిని దాటింది. ఆ తర్వాత రాత్రి 10 గంటలకు 205.39 మీటర్లకు పెరిగింది. నేడు నదిలో నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
కొండ ప్రాంతంలో భారీ వర్షాలు కొనసాగితే ఢిల్లీలో యమునా నది నీటి మట్టం 206.00 మీటర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు. యమునా నది నీటిమట్టం మళ్లీ ప్రమాదకర స్థాయికి చేరడంతో ఢిల్లీ వాసులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జులై నెలలో యమునా నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించడంతో రాజధాని ప్రాంతం నీట మునిగిన విషయం తెలిసిందే. ఆ వరద నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఢిల్లీ ప్రజలు తాజాగా మరోసారి యమునా ప్రవాహం పెరగడంతో ఆందోళన చెందుతున్నారు.
More Stories
దావోస్ నుండి వట్టిచేతులతో తిరిగి వచ్చిన చంద్రబాబు
అక్రమ వలస వెళ్లిన భారతీయులను తిరిగి రప్పించేందుకు సిద్ధం
ఉబర్, ఓలాలకు కేంద్రం నోటీసులు