అవకాశాలు వెతుక్కుంటూ సాగిన జీవితం కాదది.. వాజపేయి

డా. వడ్డీ విజయసారథి,                                                                                                                                                 *అటల్జీ 5వ వర్ధంతి నివాళి
ప్రముఖ రచయిత, సంపాదకులు, సామజిక కార్యకర్త

నాటి కేంద్ర ప్రభుత్వం నుండి రాజీనామా ఇచ్చి బయటకు వచ్చిన శ్యామా ప్రసాద్ ముఖర్జీ భారతీయ జనసంఘ్ ఏర్పరిచిన నాటి నుండి (1951)అటల్ బిహారీ వాజపేయి ఆ పార్టీలో ఉన్నారు. కాశ్మీరులో నిర్బంధించిన జీవితం గడుపుతూ ముఖర్జీ ప్రాణాలు కోల్పోయిన దరిమిలా పార్లమెంటు వేదికగా భారతీయ జనసంఘ్ వాణిని వినిపించవలసిన వక్త అవసరం ఉందని గమనించిన ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి దీనదయాళ్ ఉపాధ్యాయ 1957 ఎన్నికల్లో వాజపేయితో నాలుగు నియోజకవర్గాలలో నామినేషన్లు వేయించారు.

ప్రచారం చేసి గెలిపించ వలసిన బాధ్యత స్థానిక కార్యకర్తలలదే. అటల్జీ దేశమంతటా తిరిగి తమ పార్టీకి వోటులను అభ్యర్థిస్తారు. తన నియోజక వర్గాల్లో ఇంటింటికీ తిరగటం ఉండదు. ఈ అవగాహనతో రంగంలో దిగారు. బరేలీ, కాన్పూరులో డిపాజిట్ కూడా దక్కించుకోలేని స్థాయిలోనే వోట్లు వచ్చాయి. లక్నోలో డిపాజిట్ వచ్చింది, కాని ఓడిపోయారు. బలరాంపూర్ నుండి గెలుపొందారు. అది ఆయన తొలి విజయం.

ఆ రోజుల్లో ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ సుదీర్ఘంగా ఉపన్యాసాలిస్తుండేవారు. నూతనంగా లోకసభకు ఎన్నికైన ముప్పది ఏండ్ల యువకుడు లేచి మాట్లాడుతుంటే, నెహ్రూ తన ముందున్న కాగితాలు చూసుకొంటూ ఒక చెవి అటు ఉంచి వింటున్నారు. “కేవలం వాక్చాతుర్యం రాజనీతి కాదు, సంయమనంతో కూడిన వాగ్ధాటి రాజనీతిజ్ఞత” అనే మాట చెవినబడటంతో, చురక గట్టిగా తగలటంతో ఆయన తల ఎత్తి ‘ఎవరీ కుర్రవాడు?’ అన్నట్లుగా చూశారు. అది మొదలు. అటల్జీ ఎప్పుడు మాట్లాడినా, అందరూ శ్రద్ధగా వినేవారు.

1962 ఎన్నికల్లో బలరాంపూర్ నుండి పోటీ చేసిన అటల్జీ అక్కడ ప్రచారం చేసుకోలేదు. గోవా విముక్తి ఉద్యమంలో పాల్గొని వచ్చిన సుభద్రా జోషి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి ఊరూరా తిరిగి ప్రచారం చేసుకొని గెలిచారు. అనుకోకుండా లోకసభకు ఓడిపోయిన అటల్జీని ఆ వెంటనే ఉత్తరప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నుకున్నారు. భారతీయ జనసంఘ్ పార్లమెంటరీ పార్టీ నాయకునిగా అటల్జీ కొనసాగారు.

1967లో అటల్జీ బలరాంపూర్ నుండి పోటీచేసి, సుభద్రా జోషీని ఓడించి మంచి మెజారిటీతో గెలిచారు. 1971 ఎన్నికల్లో గ్వాలియర్ నుండి, 1977 ఎన్నికల్లో న్యూఢిల్లీ నుండి,1980 ఎన్నికల్లో మరల గ్వాలియర్ నుండి లోక్ సభకు ఎన్నికైనారు. 1984లో గ్వాలియర్ నుండి పోటీ చేస్తున్న అటల్జీని ఓడించడానికి దిగ్విజయ్ సింగ్, అర్జున్ సింగ్ లిద్దరు కలిసి పెద్ద వ్యూహం పన్నారు.

నామినేషన్లకు గడువు ముగుస్తున్న సమయంలో గ్వాలియర్ నుండి కాంగ్రెసు అభ్యర్థిగా గ్వాలియర్ మహారాజుగా పేర్కొనబడే మాధవరావు సింధియాతో నామినేషన్ దాఖలు చేయించారు. ఒక ఎన్నికల సభలో అటల్జీపై దాడి చేయించి ఆయన కాలు విరగ్గొట్టారు. అటల్జీ ప్రచారంలో వెనుకబడ్డారు. రాజకుటుంబాన్ని నెత్తిన పెట్టుకొనే గ్వాలియర్ ప్రజలు మాధవరావు సింధియాను ఎన్నుకొన్నారు.

లోకసభకు ఎన్నిక కావటంలో విఫలమైన అటల్జీ మరోసారి మధ్యప్రదేశ్ నుండి రాజ్యసభకు ఎన్నికైనారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో రెండేసి నియోజకవర్గాల  నుండి పోటీ చేయనారంభించారు. లక్నో, విదిశా, గాంధీనగర్ నియోజకవర్గాలనుండి పోటీ చేసి గెలుపొందారు.  1957నుండి ప్రతిపక్ష నాయకునిగా గుర్తింపు పొందిన అటల్ జీ 1977లో విదేశాంగ శాఖ మంత్రి అయ్యారు.

1996లో మొదటిసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 13 రోజులు అనంతరం లోకసభలో తమను సమర్థించడానికి మిగిలిన పార్టీలు సిద్ధంకాక పోవటం గమనించి రాజీనామా చేశారు.  1998లో మరోసారి ప్రధానమంత్రి అయ్యారు.1999లో విశ్వాసతీర్మానం (రాష్ట్రపతి ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం అనవచ్చునేమో దీనిని!) వీగిపోయిన దరిమిలా రాజీనామా సమర్పించారు.  అయితే ప్రభుత్వాన్ని ఏర్పరచగల సత్తా మరెవరికీ లేనందున దాదాపు ఆరు నెలల వరకు ఆయనే ప్రధాన మంత్రిగా కొనసాగారు. 1999 ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి మళ్ళీ ప్రభుత్వం ఏర్పరిచారు. 2004 వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. దేశ ప్రతిష్ఠను ఇనుమడింప చేశారు.

ఒక పార్టీ రూపుదిద్దుకుంటున్న సమయంలో దానిలో సభ్యుడై, ప్రధానమంత్రి కాగలగడం అనే దుష్కరమైన విన్యాసం సాధించటం అటల్జీ విశేషత. 1996-98 మధ్య పత్రికలవారు  “తప్పుడు పార్టీలో సరైన వ్యక్తి” అంటూ ఆయనపై విసుర్లు విసురుతూ ఉండేవారు. పత్రికలవారి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చే ఆయన సౌమనస్యాన్ని అవకాశంగా తీసుకొని ఆయనను గాయపరచడానికి కూడా కొందరు యత్నించేవారు.

టీవి కెమెరా ముందు జరుగుతున్న ఒక ఇంటర్వ్యూలో తరచుగా భాజపా నుంచి వార్తలను సేకరించే ఒక పాత్రికేయుడు ఇటువంటి పిచ్చిప్రశ్ననే వేశాడు. “వ్యక్తిగా మీపట్ల దేశమంతటా ఎంతో గౌరవము ఉంది. మీ శక్తి సామర్థ్యాలను, అనుభవాన్ని గుర్తించి అందరూ ప్రశంసిస్తున్నారు. కాని మీ పార్టీని పాలకపక్షం గా అంగీకరించడానికి వారు సిద్ధపడటంలేదు. ‘రైట్ మాన్ ఇన్ ది రాంగ్ పార్టీ’ గా ఉండిపోయే బదులుగా, మీ శక్తి సామర్థ్యాలు, అనుభవము రాణించే విధంగా నూతన మార్గాన్ని అన్వేషించటమో, అంగీకరించటమో చేయవచ్చుగదా!”

ఇది నిజంగా ఎంతటివారినైనా ప్రలోభపెట్టే ప్రతిపాదన! లేదా కోపాన్ని ఒక్క ఉదుటున బహిర్గతం చేయగల ప్రశ్న. అటల్జీ తన చిరాకును దాచుకోలేదు, అలాగని ఆ పాత్రికేయుని బుట్టలో పడలేదు. “ఠీక్ హై, నీవు చెప్పినట్లే ఆలోచిద్దాం. నేను ఎక్కడికి వెళ్లాలో, ఏమి చేయాలో నీవే చెప్పు” అన్నారు.
ఆ పాత్రికేయుని పని కుడితితొట్టిలో పడినట్లయింది. కాంగ్రెసు పార్టీలోనో, సమాజ్ వాదీ పార్టీలోనో చేరాలని తాను కెమెరా ముందు నిలబడి చెప్పలేడు గదా!

అతడు తెల్లమొహం వేయటం అయిపోయిన తర్వాత అటల్జీ కొనసాగించారు. “అవకాశాలను వెదుక్కుంటూ సాగిస్తున్న జీవితం కాదిది. జయపరాజయాలను సమానంగా స్వీకరిస్తూ, ధ్యేయసాధనకు నిరంతరంగా చేస్తున్న సాధన ఇది. నా విజయం, పార్టీ విజయం విడివిడిగా ఉండవు. నా విజయంలో పార్టీ విజయం ఉంటుంది. పార్టీ విజయంలోనే నా విజయము ఉంటుంది” అని స్పష్టం చేశారు.

అంతే కాకుండా, “ఎప్పుడైనా మేము విరిగిపోతే విరిగిపోవచ్చు గాక, కాని లొంగిపోవడం మాత్రం ఉండదు. నన్ను గురించి, మా పార్టీ గురించి మాత్రం అర్థం చేసుకోలేక పోతే, ఇన్నాళ్లు మా చుట్టూ తిరిగి నీవు ఏమి గ్రహించనే లేదు  అనుకోవాలి” అంటూ సున్నితంగా చివాట్లు పెట్టారు.  ఇదీ ప్రజాస్వామ్య పంథాలో ప్రజాసేవకు నడుం బిగించిన కార్యకర్త మనో భూమిక ఎలా ఉండాలో అటల్ బిహారీ వాజపేయి వివరించిన తీరు.