రూ. 13 వేల కోట్లతో  పీఎం విశ్వకర్మ పథకం 

పీఎం విశ్వ‌క‌ర్మ స్కీమ్ కింద ఆ వృత్తిలో ఉన్న వారికి ల‌క్ష రూపాయ‌ల రుణం ఇవ్వ‌నున్న‌ది. ఈ స్కీమ్ కోసం రూ. 13 వేల కోట్లు కేటాయించింది. ఈ పథకంలో భాగంగా సాంప్రదాయ హస్త కళా నైపుణ్యాల పెంపునకు ప్రభుత్వం ఆర్థిక మద్దతు అందించనుంది అత్య‌ధికంగా 5 శాతం వ‌డ్డీతో ఆ రుణాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. 
 
కేంద్ర మంత్రివర్గం బుధవారం  తీసుకున్న నిర్ణ‌యాల‌ను ఆయన వెల్ల‌డించారు. చాలా స‌ర‌ళ ప‌ద్ధ‌తిలో సంప్ర‌దాయ నైపుణ్యం క‌లిగిన వారికి రుణాలు ఇవ్వ‌నున్న‌ట్లు మంత్రి చెప్పారు. విశ్వకర్మ యోజన పథకం కింద దాదాపు 30 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలుగుతుందని కేంద్రం పేర్కొంటోంది.
 
హస్త కళాకారులు ఈ కొత్త స్కీమ్ కింద సబ్సిడీ వడ్డీ రేటుతో రూ. 2 లక్షల వరకు రుణం పొందొచ్చు. వడ్డీ రేటు 5 శాతంగానే ఉంటుంది. అంటే ఇది చాలా తక్కువ వడ్డీ రేటు అని చెప్పుకోవచ్చు. విశ్వ కర్మ జయంతి సందర్భంగా ఈ స్కీమ్‌ను అమలు చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది. 
నేత కారులు, స్వర్ణ కారులు, కమ్మరి, లాండ్రీ కార్మికులు, క్షురకులు వంటి వారు ఈ స్కీమ్ కింద ప్రయోజనం పొందొచ్చు. వీరి కుటుంబాలకు సులభంగా రుణాలు లభించనున్నాయి.
 
అలాగే మోదీ ప్రభుత్వం మరో పథకం కూడా తీసుకొచ్చింది. కేంద్ర మంత్రివర్గం పీఎం ఇ-బస్ సేవా పథకానికి ఆమోదం తెలిపింది. కేంద్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రూ. 57,613 కోట్లు కేటాయించింది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది.  ఈ మొత్తంలో కేంద్ర‌మే 20వేల కోట్లు ఇవ్వ‌నున్న‌ది.
 
169 పట్టణాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. 3 లక్షలు లేదా ఆపైన జనాభా కలిగిన పట్టణాల్లో ఈ ఎలక్ట్రిక్ బస్సులు పరుగులు పెట్టనున్నాయి. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ ద్వారా ఈ బస్సులను నడుపనున్నారు. ఈ స్కీమ్ కింద బస్ సేవలకు పదేళ్ల వరకు ప్రోత్సాహం లభిస్తుంది.

181 పట్టణాలలో హరిత పట్టణ రవాణా సదుపాయాల కల్పనలో భాగంగా మౌలిక సదుపాయాలను కూడా అభివృద్ధి చేస్తారు.
అన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల రాజధాని నగరాలతో పాటు పర్వత ప్రాంతాల పట్టణాలలో ఈ సదుపాయాలను కల్పిస్తారు. 45 వేల మంది నుండి 55 వేల మంది వరకు ఈ కార్యక్రమాల ద్వారా ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారు.  ఇంకా కేంద్ర ప్రభుత్వం డిజి లాకర్ సర్వీసులను మైక్రో స్మాల్ మీడియాం ఎంటర్‌ప్రైజెస్‌కు విస్తరించింది. 
అలాగే కేంద్రం తాజాగా భారతీయ రైల్వేలకు  సంబంధించి ఏడు మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని కోసం రూ. 32,500 కోట్లు కేటాయించనుంది.  అలాగే ప్రస్తుతం ఉన్న 18 సూపర్ కంప్యూటర్లకు అదనంగా మరో 9 కంప్యూటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్ కింద వీటిని ఏర్పాటు చేయనుంది. మోదీ సర్కార్ డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్‌ను కూడా పొడిగించింది. దీని కోసం రూ. 14,903 కోట్లు కేటాయించనుంది.