రామ కథ కార్యక్రమంలో రిషి సునాక్‌

హిందూ విశ్వాసమే జీవితంలోని ప్రతి అంశంలో తనకు మార్గదర్శకం చేస్తుందని బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తెలిపారు. భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురష్కరించుకొని బ్రిటన్‌ కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలోని జీసస్‌ కళాశాలలో ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు ఆధ్వర్యంలో కొనసాగుతున్న రామ కథ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు.
భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో మంగళవారం రామ కథ ప్రవచనాన్ని నిర్వహించారు. ప్రముఖ ఆధ్యాత్మిక బోధకుడు మొరారి బాపు శ్రీరాముని చరితను వినిపించారు. ఈ కార్యక్రమంలో రుషి సునాక్ ‘జై సియారామ్’ నినాదాలు చేశారు.
 
ఈ సందర్భంగా రిషి సునాక్‌ మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉందని చెప్పారు. ‘ఈ కార్యక్రమానికి రావడం నిజంగా నాకెంతో గౌరవంగా, చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి నేను ప్రధానిగా రాలేదు. ఒక హిందువుగా వచ్చాను. విశ్వాసం అనేది నా దృష్టిలో వ్యక్తిగతం. ఇది నా జీవితంలోని ప్రతి అంశంలో నాకు మార్గదర్శకం చేస్తుంది’ అని తెలిపారు. 
 
`ప్రధాని పదవి అనేది గొప్ప గౌరవం. కానీ, అది అంత తేలికైన పని కాదు. చాలా కష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ సమయంలో మన విశ్వాసమే మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక, ప్రవచనం వేదికపై ఏర్పాటు చేసిన హనుమంతుడి పోస్టర్‌ను ప్రస్తావించిన రిషి సునాక్ తన అధికారిక కార్యాలయంలోని టేబుల్‌పై కూడా బంగారు గణేశుడి విగ్రహం ఉందని పేర్కొన్నారు.
 
 ‘నా కార్యాలయంలో బంగారు వినాయకుడి విగ్రహం ఉంటుంది. ఏ పని చేసే ముందైనా వాటి గురించి తెలుసుకొని జాగ్రత్తగా పరిశీలించాలని ఆ విగ్రహం నాకు సూచిస్తుంటుంది. చిన్నతనంలో నేను తరచూ సౌతాప్టన్‌లోని గుడికి వెళ్లి వస్తుండేవాడిని. స్థానిక మందిరంలో నాకు ఎన్నో జ్ఞాపకాలున్నాయి. నా తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పూజలు, హోమాలు చేసేవారు. అనంతరం నా సోదరులు, సోదరీమణులతో కలిసి భక్తులకు తీర్థప్రసాదాలను అందజేసేవాడిని’ అని రిషి సునాక్‌ వివరించారు.

మొరారి బాపు చెప్తున్న రామాయణంతోపాటు భగవద్గీత, హనుమాన్ చాలీసాలను కూడా స్మరించుకుంటూ తాను ఇక్కడికి రావడానికి బయల్దేరానని చెప్పారు. సవాళ్లను ధైర్యంతో ఎదుర్కొనడానికి, అణకువతో ప్రవర్తించడానికి, నిస్వార్థంగా పని చేయడానికి తనకు శ్రీరాముడే స్ఫూర్తిప్రదాత అని తెలిపారు. రుషి ఈ సందర్భంగా హారతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. సోమనాథ దేవాలయం నుంచి తీసుకొచ్చిన శివలింగాన్ని ఆయనకు మొరారి బాపు బహూకరించారు.