ఏపీ మహిళా కమిషన్ సభ్యుల్లో కుస్తీలు

రాష్ట్రంలోని మహిళల హక్కుల పరిరక్షణకు ఉద్దేశించిన ఆంధ్ర ప్రదేశ్ మహిళా కమిషన్ లో తమ గౌరవ మర్యాదలకే భరోసా ఉండటం లేదని కమిషన్ సభ్యులు వాపోతున్నారు. ముఖ్యంగా వైసీపీ నాయకురాలిగా చట్టసభల్లోకి వెళ్లాలనుకున్న వాసిరెడ్డి పద్మకు మహిళా కమిషన్ చైర్మన్ పదవి ఇచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సరిపెట్టారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఓ పార్టీ నాయకురాలిగానే వ్యవహరిస్తూ తరచూ ఆమె వివాదాలకు గురవుతున్నారు.
 
తాజాగా రాష్ట్ర మహిళా కమిషన్‌ కార్యాలయంలో కమిషన్‌ సభ్యులకు కనీసం ఛాంబర్‌‌లు కూడా కేటాయించలేదని, కూర్చోడానికి కనీసం కుర్చీ కూడా లేని దుస్థితి ఉందని అంటూ కమిషన్‌ సభ్యురాలు గజ్జల లక్ష్మీ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. జాతీయ మహిళా కమిషన్ కార్యక్రమాలకు హారాజైతే తమకు ప్రయాణ ఖర్చులు కూడా ఇవ్వడం లేదంటూ ఆమె వాపోయారు.

ఏపీ మహిళా కమిషన్‌లో పేరుకు మాత్రమే తాము పదవిలో ఉన్నామంటూ గజ్జల లక్ష్మీ సోషల్‌ మీడియాలో విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది. రెండేళ్లు మహిళా కమిషన్‌ సభ్యురాలి హోదాలో జాతీయ మహిళా కమిషన్‌ హిమాచల్‌ ప్రదేశ్‌, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్‌, దిల్లీ వంటి నగరాలతో పాటు విశాఖపట్నంలో నిర్వహించిన సమావేశాలకు హాజరయ్యానని వీడియోల్లో వివరించారు. 

ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు వెళ్లేందుకు ప్రతిసారీ విమాన టికెట్‌‌తో పాటు, ఇతర ఖర్చులు కలిపి రూ.50-60 వేల వరకు ఖర్చయిందని ఆమె తెలిపారు.  సదస్సులు, సమావేశాలకు వెళ్లడానికి ప్రతిసారి సొంత డబ్బే ఖర్చు పెట్టుకుంటున్నామని చెప్పారు. దాదాపుగా రూ.2.50 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు బిల్లులు బకాయిలున్నాయని ఆమె పేర్కొన్నారు. 

తమకు రావాల్సిన మొత్తాన్ని చెల్లించాలని ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేశానని అయినా ఫలితం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఖర్చులకు సంబంధించి మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ సంతకం పెట్టకపోతే బిల్లులు చెల్లించడం కుదరదంటున్నారని ఆమె చెప్పారు. 

అయితే, ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ మాత్రం బిల్లులపై సంతకాలు పెట్టడం లేదని ఆమె ధ్వజమెత్తారు. మహిళా కమిషన్‌లో పరిస్థితి ఇలా ఉంటే పార్టీలో మాత్రం మహిళా కమిషన్‌ సభ్యులు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు చేస్తున్నారని వీడియోలో ఆమె విస్మయం వ్యక్తం చేశారు.