టీ20ల్లో అగ్ర‌స్థానంలో సూర్యకుమార్

భార‌త స్టార్ క్రికెట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ టీ20ల్లో అగ్ర‌స్థానం నిలబెట్టుకున్నాడు. అఫ్గ‌నిస్థాన్ కెప్టెన్ ర‌షీద్ ఖాన్ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో నంబ‌ర్ 1గా నిలిచాడు. టీ20 ఆల్‌రౌండ‌ర్ల‌లో బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కిబుల్ హ‌స‌న్‌ టాప్ ర్యాంక్ సొంతం చేసుకున్నాడు. టీమిండియా పొట్టి ఫార్మాట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ‌ర్ల జాబితాలో రెండో ర్యాంక్ సాధించాడు.
బుధవారం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్ర‌క‌టించింది.  వెస్టిండీస్‌పై ఐదు టీ20ల సిరీస్‌లో దంచి కొట్టిన సూర్య 907 పాయింట్ల‌తో టాప్‌లో ఉన్నాడు. పాక్ ఓపెన‌ర్ మ‌హ‌మ్మ‌ద్ రిజ్వాన్ రెండో స్థానం ద‌క్కించుకున్నాడు. బాబ‌ర్ ఆజాం మూడు, ఎయిడెన్ మ‌ర‌క్రం నాలుగు, రీలే ర‌స్సో ఐదో స్థానంలో కొన‌సాగుతున్నారు.  భార‌త క్రికెట‌ర్ల‌లో విరాట్ కోహ్లీ 17వ స్థానం, రోహిత్ శ‌ర్మ 34వ ప్లేస్‌లో ఉన్నారు. విండీస్ సిరీస్‌లో అద్భుతంగా రాణించిన‌ తిల‌క్ వ‌ర్మ 46వ స్థానంలో నిలిచాడు. బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో ఒక్క భార‌త క్రికెట‌ర్ కూడా టాప్ 10లో చోటు ద‌క్కించుకోలేక‌పోయాడు.

టాప్ -5 బౌల‌ర్లు : ర‌షీద్ ఖాన్, జోష్ హేజిల్ వుడ్(ఆస్ట్రేలియా), వ‌నిందు హ‌స‌రంగ‌(శ్రీ‌లంక‌), మ‌హీశ్ థీక్ష‌ణ‌(శ్రీ‌లంక‌), ఆదిల్ ర‌షీద్‌(ఇంగ్లండ్)లు టాప్ 5 ర్యాంకు ద‌క్కించుకున్నారు.

టాప్ – 5 ఆల్‌రౌండ‌ర్లు : ష‌కిబుల్ హ‌స‌న్(బంగ్లాదేశ్), హార్దిక్ పాండ్యా(భార‌త్), మ‌హ‌మ్మ‌ద్ న‌బీ(అఫ్గ‌నిస్థాన్), షాదాబ్ ఖాన్‌(పాకిస్థాన్‌), వ‌నిందు హ‌స‌రంగ‌(శ్రీ‌లంక‌).

ఇలా ఉండగా, 15 ఏళ్లుగా టీ20లు జరుగుతున్నా ఇప్పటివరకు ఒక్క బౌలర్ కూడా ఈ ఫార్మాట్‌లో టీమిండియాకు నాయకత్వం వహించలేదు. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటివరకు 10 మంది భారత్‌కు సారథ్యం వహించారు. అందులో ఒక్క స్పెషలిస్ట్ బౌలర్ కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. ఈ నేపథ్యంలో టీ20ల్లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించనున్న తొలి స్పెషలిస్ట్ బౌలర్‌గా బుమ్రా నిలవనున్నాడు.

ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయిన భారత్ ఈనెల 18 నుంచి ఐర్లాండ్‌తో మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ద్వారా టీమిండియాకు మరో కెప్టెన్ రాబోతున్నాడు. స్టార్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వంలో యువ ఆటగాళ్లు ఐర్లాండ్‌తో సిరీస్‌లో తలపడనున్నారు. దీంతో బుమ్రా చరిత్ర సృష్టించబోతున్నాడు.