కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది మొదలు రాజధాని బెంగళూరు సహా అనేక ప్రాంతాల్లో విద్యుత్తు కోతలు ప్రజల్ని ఇబ్బందికి గురిచేస్తున్నాయి. గత నాలుగు రోజులుగా రాష్ట్ర రాజధాని బెంగళూరులో రోజుకు నాలుగు గంటల చొప్పున కోతలు విధిస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య సరఫరా నిలిపివేస్తున్నారు.
ఇక గ్రామీణ ప్రాంతాల్లో అనధికార కోతలు ఆరేడు గంటల పాటు విధిస్తున్నట్టు సమాచారం. ఒకవైపు విద్యుత్తు కోతలు, మరోవైపు చార్జీల పెంపుతో పారిశ్రామిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కర్ణాటక చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ పిలుపు మేరకు వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక వర్గాలు జూన్ 22న బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశాయి.
రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్తు కేంద్రాలలో ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. రాయచూర్, యరమారస్, జిందాల్ (బళ్లారి), ఉడుపి విద్యుత్తు కేంద్రాలలో కలిపి మొత్తం 7,680 మెగావాట్ల విద్యుత్తు ఉత్పాదన జరగాలి. కానీ గత మంగళవారం విద్యుత్తు ఉత్పత్తి కేవలం 945 మెగావాట్ల వద్దే ఆగిపోయింది. 1200 మెగావాట్ల సామర్థ్యం గల రెండు యూనిట్లు ఉన్న ఉడుపిలో ఉత్పత్తి పూర్తిగా స్తంభించింది.
రాయచూర్‌లో 1, 2, 3, 6, 7 యూనిట్లలో ఉత్పాదన నిలిచిపోయింది. బళ్లారిలో ఒక యూనిట్ మాత్రమే పని చేయడంతో కేవలం 169 మెగావాట్లకు పరిమితమైంది. యరమరాస్ రెండో యూనిట్‌లో ఉత్పాదన ఆగిపోగా ఒకటో యూనిట్‌లో 403 మెగావాట్ల ఉత్పత్తి నమోదైంది. 55 మెగావాట్ల ఉత్పాదన ఆపినట్టు జిందాల్ పేర్కొంది.
బొగ్గు కొరత లేకపోయినా, జలాశయాలలో నీటి మట్టం పెరుగుతున్నా రాష్ట్రంలో విద్యుత్తు ఉత్పాదన పడిపోవడానికి కారణమేంటో చెప్పలేక సిద్దరామయ్య ప్రభుత్వం తికమక పడుతున్నది.
మరోవంక, రాష్ట్రంలో ఇటీవల విద్యుత్తు ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. విధి నిర్వహణలో మరణించిన లైన్‌మెన్ కుటుంబాలకు, వైకల్యం చెందిన ఉద్యోగులకు రూ.25 లక్షల వరకు నష్టపరిహారం చెల్లించాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సస్పెండ్ చేసిన ఉద్యోగులపై సత్వరమే విచారణ పూర్తి చేసి తప్పులేని వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నాయి. గ్రేడ్-1 ఇంజినీర్లు, గ్యాంగ్‌మెన్లు, లైన్‌మెన్లు, మీటర్ రీడర్లు ధర్నాకు సంఘీభావం ప్రకటించారు.
More Stories
పార్లమెంట్లో ఎన్ఆర్ఐలకు ప్రాతినిధ్యం కల్పించాయి
మహాకుంభమేళలో ప్రత్యేక ఆకర్షణగా పూసలమ్మ మోనాలిసా
వన్డే ర్యాంకింగ్స్లో రెండో స్థానంలో స్మృతి మంధాన